|
|
Articles: Poetry | గ్లోబల్ వార్నింగ్ - Mr. venkat rama rao ravulapati
| |
నున్నటి గట్టు మీద ఒంటిగ కూర్చున్న
పక్షి కళ్ళు ఎక్కడో చూస్తున్నాయి
ఆలోచనలు చిక్కబడి చిక్కుబడినట్లున్నాయి
ఇంటి కప్పు మీద పిల్లకోతి గంతులేస్తుంటే
తల్లికోతి మరో పిల్ల పేలు కుక్కుతోంది
తండ్రి కోతి ఎక్కడో చూపుపారేసుకున్నా
కిచకిచల చప్పుడుకు చిరాకుపడుతోంది
మడుగులో చేపపిల్ల ఈదులాట చలాకిగా లేదు
గట్టు మీద కోయిల పాట కమ్మగా లేదు
చెట్ల కొమ్మల్లో గాలి కదలికలు లేవు! పాపం
కొమ్మలకు గిలిగింత లేదు - పులకింత రాదు!
కుక్కపిల్ల కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది
ఏమైందో పిల్లాడు ఉయ్యాల్లో గుక్కపట్టి ఏడుస్తున్నాడు
సన్నటి మంటలా రగిలి వేడి బాగానే రాజుకుంది
తాపం ఎగసి పెనుభూతంలా మారింది
అణువణువూ విస్తరించి విశ్వరూపం దాల్చింది
నిరాశ, నిరామయ, నికృష్ట జీవాలన్నీ
వేలెత్తి చూపుతున్నాయి 'నిన్నే'
కారణం నువ్వేనని జాలిగా నిన్నే చూస్తున్నాయి
నిజమేగా అనుభవించు మరి!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|