|
|
Articles: Poetry | సాగరతీరాన.. - Mr. Lokesh Sreekanth Bellamkonda
| |
సాయంత్ర వేళ సాగరతీరాన
సర్వం మరచి నే ఎదురుచూస్తున్నా
నువ్వు వస్తావని!
నవ్వులిస్తావని!!
అనంత నింగిలో అద్భుత మేఘాలు
నీ సోగ కళ్ళల్లో వేసె పాగాలు
ఊయలలూగే నీ కురుల ముంగుర్లు
ఉప్పొంగి దూకే ఉన్నత కెరటాలు
ప్రతి సంధ్యా నాకు ప్రాతస్సంధ్యే
నీ వన్నెల తళుకుల కన్నులవిందే
నీ కొరకే ఈ నిరీక్షణ!
కనికరించు తరళేక్షణ!!
నీ మందహాసాన విరిసే వెలుగులు
ముత్యాల హారాల మెరిసే జిలుగులు
దిక్కుల దారింట ఎర్రటి కాంతులు
నీ చేతి గోరింట పూచిన కెంపులు
చుట్టూ సందడి చిక్కగా ఉన్నా
వాటికి స్థానం హృదిలో సున్నా
నువ్వే నా వలపుల తలపు!
నీ పిలుపులే మేలుకొలుపు!!
ఇసుకతిన్నెలపై ఎగిరే నీ అందెలు
నా పాలిట మోహన ప్రణయనాదాలు
సోకితేనే నీ పల్లవ పాదాలు
సముద్రాన జనించు స్వాతిముత్యాలు
నిను స్పృశించి ఏమో కడలి పవనం
నిలువునా నింపుకుంది చల్లదనం
నువ్వే లేని సాయంత్రం!
నేనోర్వలేని నరకప్రాయం!!
కుంచెకు దొరకని ఓ అన్నులమిన్నా!
కవితకు అందని నా కులుకుల మైనా!!
తుదిలేని ఈ ఆలోచనలు
తెగిపోని నా ఆలాపనలు
నీ వైపునే!
నీ కోసమే!!
నువ్వు వస్తావని
నవ్వు ఇస్తావని
మనసు ఇవ్వాలని
మురిసిపోవాలని!!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|