|
|
Articles: Poetry | ప్రేమా! ఐ లవ్ యు - Site Administrator
| |
(ఎం. శ్రీధరరావు)
ఒకప్పుడు నిజాయితీతో స్నేహం చేసిన తను
కవుల హృదయాల్లో, గాయకుల కంఠాల్లో
ఆత్మీయంగా, జనరంజకంగా విహరించిన తను
విలువలు, వలువలు కోల్పోయి
ఇవాళ హింసా మార్గంలో పరిగెడుతోంది!
ఇంటర్నెట్ లను, టి.వి చానెళ్ళను ఆశ్రయించింది.
వ్యాంప్ పాత్రను హీరోయిన్ గెటప్ లో అలరించి
ప్రేమగా యువ ప్రపంచానికి చేరువయ్యింది!
అవమానాలను, ఆడమానాలను అడుమానంగా పెట్టి
ఆడ ప్రాణాలను నొక్కేస్తున్న రక్కసిని
'ప్రేమ'గా అభివర్ణిస్తున్నాయి తాజా నిఘంటువులు!
పైశాచిక ప్రణయాన్ని వ్రేళ్ళుగా చేసుకున్న వృక్షం
రాక్షస రమణీయకతను పండ్లుగా, పూలుగా ఇస్తోంది.
కత్తితో గొంతులు కోసేసి మగతనాన్ని చాటుకున్నా
పన్నీరు బుడ్లలో ఆమ్లాన్ని నింపేసి
గంధప్పొడులలో కారాన్ని కలిపేసి
విలయతాండవాలు చేసినా
దీన్ని ప్రేమగానే పిలుస్తున్నారు!
ఆ మొన్న శ్రీలక్ష్మి, మొన్న లక్ష్మీ భవాని, తర్వాత మీనా
ఇలా ఎందరినో బలికొంటూనే ఉంది
ప్రేమ కాని ఈ ప్రేమ.
ఎదురు దాడులు జరగనంతకాలం
వెన్నుపూసలు విరచనంతకాలం
వికృత చేష్టలు సమాజాన్ని
విషపూరితం చేస్తూనే ఉంటాయి!
ఎస్సెమ్మెస్ ల ద్వారా, టీవీ చానెళ్ళ ద్వారా
ప్రపంచానికి పంచే గాలి కబురు ప్రేమ కాబోదనీ
మానవత్వాన్ని సజీవంగా ఉంచడానికి
ఊపిరులూదే ప్రాణవాయువే ప్రేమ అనీ
రెక్కలు విచ్చుకుంటున్న మొగ్గలకు తెలియజెప్పండి!
మష్తిష్కాల్లో మల్లెలు పూయిస్తేనే
ప్రేమ సుగంధాలు వెల్లివిరుస్తాయి
జీవధారల్ని దశదిశలా విరజిమ్ముతాయి!
రేపటి పౌరుల మెదళ్ళలోకి
ప్రమాణాలు పొదిగిన వెలుగు గుళికల్ని చొప్పించే
శస్త్ర చికిత్సలను క్రమశిక్షణతో నిర్వహించండి.
నిబద్ధతను సాంకేతికతతో శృతిచేస్తూ
నవయువత మనోఫలకాలపై
సప్తవర్ణాలను లయబద్ధంగా ఆవిష్కరించండి!
అసలైన ప్రేమను
మనసారా ఆస్వాదించండి!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|