|
|
Articles: My Thoughts | భోగి విశేషం - Site Administrator
| |
(జి. సురేష్)
ఆంధ్ర రాష్ట్రంలో తరతరాలుగా వస్తున్న పెద్ద పండుగ సంక్రాంతి. ఇది ప్రధానంగా మూడు రోజుల పాటు జరుపుకొనే పండుగ. ఈ సంవత్సరం తొలిరోజు అంటే బుధవారంనాడు భోగి పండుగను జరుపుకొంటున్నాం. భోగి అంటే భోగానికి సంబంధించిన పదమని అర్థం చేసుకొంటూనే ఉంటారు. అయితే, దీని మూలాల్లోకి వెళితే మరి కొన్ని విశేషాలు మనకి కనిపిస్తాయి.
'భుజ్' అనే దాతువు నుంచి భోగి అనే పదం ఉద్భవించింది. పూర్వకాలంలో భోగి పండుగను దేవేంద్రుడి ప్రీతి కోసం చేస్తూ ఉండేవారని పురాణాలు, మత గ్రంథాల్లో కనిపిస్తుంది. భోగి అనే పదం నుంచి ద్రావిడ భాషలోకి కొన్ని పదాలొచ్చి అవి కూడా ఈ పండుగను ప్రకటిస్తున్నాయి. మనకు తరచూ వినిపించే ద్రావిడ భాషలోని పోగు, పొంగు అనే పదాలకు భోగికి సంబంధం ఉందని, ఆ పదాల సంస్కృతీకరణమే భోగి అని భాషా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు చేసుకొనే పండుగ ఈ భోగి.
భోగిరోజు తెల్లవారు జామున ప్రతి ఇంటి ముందు భోగిమంటలు వేస్తారు. ఈ మంటల్లో అప్పటి దాకా ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ వేసేస్తారు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దీన్నే 'లోడి' అనే పేరున ఆనందంగా జరుపుకొంటూ ఉంటారు. భోగి మంటలు వేశాక చిన్న, పెద్ద అంతా శుభ్రంగా తలస్నానాలు చేసి దాంతో అంతకు ముందున్న పీడ అంతా వదిలిపోయిందని భావిస్తూ ఆనందిస్తారు. అంతకు ముందు వరకూ ఏవైనా అశుభాలో, అవాంఛనీయాలో జరిగి బాధలు పడి ఉంటే ఆ బాధంతా ఆ క్షణంతోనే పోయిందని, ఇక మీదట అంతా శుభమేనని భావిస్తూ పండుగ జరుపుకొంటారు.
పూర్వం నుంచి మనది వ్యవసాయ ఆధారిత దేశం కనుక సంక్రాంతి పండుగలో అన్ని రోజులూ వ్యవసాయ జీవనానికి సంబంధించిన విశేషాలు కనిపిస్తాయి. వరి కంకులను తోరణాలుగా కట్టి అలంకరిస్తారు. గడపలను పసుపు కుంకుమలతో తీర్చిదిద్దుతారు. ఇవన్నీ భోగి చిహ్నాలు. అలాగే కొత్త బియ్యం తెచ్చి పలు రకాల కూరగాయలు కలిపి పాలు పోసి పొంగలి, పులగం చేస్తారు. ఇవన్నీ మనకు సంప్రదాయకంగా వస్తున్న వంటల విశేషాలు. ఆ తరువాత సాయంత్రానికి చిన్నపిల్లలకు రేగుపళ్ళు, చెరకుముక్కలు కలిపి భోగిపళ్ళు పోయటం ఆచారంగా వస్తోంది. చిన్నపిల్లల నెత్తి మీద భోగిపళ్ళను పొయ్యటమనే ఆచారం వెనుక జ్యోతిష శాస్త్ర, ఖగోళ శాస్త్ర సంబంధమైన అంశాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|