|
|
Articles: Devotion | విశ్వనాథ ప్రభూ! - Mr. kompellaramakrishna murty
| |
శ్రీకంఠా! నిటలాక్ష! శైలతనయా శృంగార దీపప్రభా!
లోకాధీశ్వర! హర్షతాండవ కళాలోలా! మహేశా! శివా!
వ్యాకీర్ణేంద్రియ దీనజీవన భిషగ్వర్యా! సదా చిన్మయా!
పాకారి ప్రముఖార్చితాంఘ్రియుగ! శర్వా! విశ్వనాథ ప్రభూ!
మల్లెల్ మొల్లలకంటె, సంపెగలు, పద్మశ్రేణిపై కంటె - జి
ల్లేళ్ళున్, మారెడు పత్రి, యుమ్మెతలపై లిప్సన్ బ్రదర్శించు నీ
యుల్లంబెంత దయార్ద్రమో! ప్రకృతిలో నుచ్చామ్ము నల్పమ్మునున్
కల్లల్ - సర్వముఁజూడ చిన్మయము భర్గా! విశ్వనాథ ప్రభూ!
చితి వెంటన్ చితిఁబేర్చి నిత్యమొక యర్చిష్మంతమౌ సత్య సం
గతిఁగంటన్ మణికర్ణికన్ గనుచు నా ఘట్టమ్ము తామెప్డు జీ
విత మార్గంబున నందబోమనుచు నుద్వేలభ్రమన్ సాగు దు
ర్మతులన్ జ్ణ్జానులఁజేసి కావుము త్రినేత్రా! విశ్వనాథ ప్రభూ!
ఏదో యక్కర నెత్తిపైకెగసి గానీ నిన్ను ప్రార్థింతునా?
నా దాష్టీకమదెంత గొప్పదని! నానా హీన భావాలకున్
పాదై చేదు ఫలమ్ములన్ బడసి యా పాపమ్ము వెంటాడగా
నీదే భారమటంచుఁగూయిడుదు తండ్రీ! విశ్వనాథ ప్రభూ!
ఒక కార్యంబనుకూలమైనయెడ నత్యుత్సాహముం బొంది దీ
నికి నా బుద్ధిబలమ్మె మూలమనుచున్ నిర్ణేతనై పల్కెదన్
ఒక కార్య ప్రతికూల హేతిఁబడి, దుర్యోగంబు సిద్ధింప దా
నికి నీ నిర్దయ కారణంబనెద నేనే విశ్వనాథ ప్రభూ!
నీ పాదంబుల మ్రోలఁజేరితి, భవానీమాతృహాస ప్రభల్
నాపై సోకగ, కించిదున్నమిత సన్నాహుండనై నీ దయా
శ్రీపారమ్య మెరుంగఁగోరితి భవచ్చీర్షాభ్ర గంగాఝరిన్
తాప శ్రేణి శమింపగా విడుము రుద్రా! విశ్వనాథ ప్రభూ!
ఇది నా గేస్తుతనంబటంచు తలపై నెన్నేనియున్ భారముల్
ముదమున్ గూర్చునటంచుఁదాల్చెదను, బిబ్బోకంబు వెంటాడి దు
ఖదమీ బంధ నిధాన నిర్గతికి మార్గంబొండు శోధించెదన్
తుదనెగ్గించెడి చేవ లేదనుచు తేల్తున్ విశ్వనాథ ప్రభూ!
తలపై చల్లని చంద్రశాలయు, త్రినేత్ర జ్వాల ఫాలంబునన్
గళమా హాలహలాధివాసము, జటన్ గంగామృత స్రోతమున్
నిలయమ్మా హిమశైలశృంగము, భవన్నిష్ఠల్ శ్మశానంబునన్
భళిరా! ద్వంద్వములెల్ల నీకడనె లేవా? విశ్వనాథ ప్రభూ!
ఎటులయ్యా! కరుణింపకుండిన? క్షణంబేనిన్ మృషాలోక లం
పటులౌ జీవులు నిన్నుఁగొల్వరని చెప్పన్ సత్యదూరంబు కా
దటులౌటన్ కుపితుండవై వదలుటేనా? వారి వక్రక్రియా
ర్భటులన్ మార్చదె నీ విలాసమొక లిప్తన్? విశ్వనాథ ప్రభూ!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|