|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళూ చేసి, ఎవరి భార్యలకి వాళ్ళనప్పగించేసరికి శంకర్రావు రిటైరయిపోయాడు. ప్రొద్దున్నేలేచి స్నానం, పూజ, భోజనం అయిపోతే సరి. ఇహ మిగిలిన టైమంతా ఏం చెయ్యాలనే ప్రశ్న భూతంలా ఎదుట నిలబడుతోంది. సుమతీ అంతే. అటూ ఇటూ నలుగురున్న కుటుంబాలవడం వలన పదిమందిలో కలిసిపోయే తత్వం. పదిమందికి వండిపెట్టే చెయ్యి. గుజ్జనగూళ్ళాడినట్టు ఇద్దరికి వంటచేయడం కష్టంగానే ఉంది. ఏదైనా ఆ ఒక్కపూటే. రాత్రికి ఏ ఫలహారమో కానిచ్చేస్తారు. అందుకే సుమతికీ, శంకర్రావుకీ కూడా తెల్లారుతోందంటేనే ఏం చెయ్యాలి? అన్న ప్రశ్న ఎదురౌతుంది.
ఖాళీగా ఉన్న బుర్ర పిల్లల గురించే ఆలోచిస్తుంది. మొన్న చంటిపిల్లాడికి జలుబుగా ఉందన్నాడు, తగ్గిందో లేదో... అనుకుంటూ మొగుడూ పెళ్లాలిద్దరూ చర్చ మొదలుపెడతారు. వాళ్ళకి తెలిసివాళ్ళ చంటిపిల్లలకొచ్చిన జలుబుల గురించి చర్చించి, అది జ్వరానికి దారితీసే దాకా సాగి, ఆఖరికి హాస్పటల్ లో చేర్పించే వరకు వెళ్ళి, అక్కడ స్థిరపడిపోతారు. ఇద్దరూ మనవడిని హాస్పటిల్ చేర్పించేసినట్టు ఊహించేసుకుని, కంగారుపడిపోయి, అమెరికా ఫోన్ చేసేసి... ఆ చంటిపిల్లాడి జలుబు అప్పుడే తగ్గిపోయిందనీ, ప్రస్తుతం వాడు వాళ్ళ అమ్మా, నాన్నల జలుబు వదిలిస్తున్నాడన్న సంగతి వినేవరకూ మనశ్శాంతిగా ఉండలేరు.
అందుకే కొడుకులకి ప్రతివారం ఫోన్ చెయ్యమని ఒకటికి పదిసార్లు చెప్తుంటారు. అమెరికాలో వాళ్ళ కొడుకుల పరిస్థితీ అలాగే ఉంది. వాళ్ళకీ తెలుసు... ఆదివారం ప్రొద్దున్న మాట్లాడే ఆ పది మాటల కోసం అమ్మా, నాన్నా ఎదురుచూస్తుంటారని.
వాళ్ళు మటుకేం చేస్తారు.... వాళ్ళనక్కడికి రమ్మంటే వచ్చి పదినాళ్ళు కూడా ఉండరు. ఉండలేరు కూడా... అక్కడ వాళ్ళకి తోచదు. మా ఊరు, మా ఇల్లంటూ వచ్చేస్తారు. తీరా వచ్చాక దృష్టంతా పిల్లల మీదే. చేస్తున్న ఉద్యోగాలు వదిలి రాలేరు కదా... అందుకే ప్రతివారం తప్పకుండా ఫోన్ చేస్తారు. కాని ఎప్పుడైనా లైన్ దొరకకపోతే పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు..?
సుమతి పూజ చేసుకుంటోందన్న మాటే కాని చెవుల్ని మటుకు ఫోన్ శబ్దం వినడానికి వినియోగించేసింది. నిత్యపూజ అయింది. ఆంజనేయస్వామొక్కడే సముద్రందాటి వాయువేగంతో అమెరికా వెళ్లి పిల్లల్ని క్షేమంగా ఉంచగలడని అంత ప్రగాఢ విశ్వాసం. ఇంకా ఫోన్ మోగలేదు. పిల్లలెలా ఉన్నారో... ఆంజనేయస్వామీ... తండ్రీ... సముద్రాన్ని అవలీలగా దాటగలవాడివి నువ్వే... నా బిడ్డల్ని కాయి తండ్రీ... అనుకుని... ఆంజనేయ దండకం మొదలుపెట్టింది. చదువుతున్నకొద్దీ ఆమెకి తెలియకుండానే అమెరికా వెళ్ళిన ఆంజనేయస్వామికి కూడా ఆ దండకం వినపడేలా ఆమె గొంతు హెచ్చింది.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|