|
|
Articles: Short Stories | తలవంపులు - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
ఆ అమ్మాయి తండ్రి...
అతనో మధ్య తరగతి కుటుంబీకుడు.
అతని తల్లిదండ్రులు అతనికి పైచదువులు చెప్పించలేకపోయారు.
చదువాపించి చిన్న వయస్సులోనే ఉద్యోగంలో చేర్పించారు.
ఇక అతడు ఇంటి బాధ్యతలని తలకెత్తుకున్నాడు.
తండ్రికి చేదోడుగా ఉంటూ, తోబుట్టువులను చదివించాడు. పెళ్లిళ్లు చేశాడు.
తల్లిదండ్రుల బాధ్యతలూ - ఋణాలూ తీరాయనేసరికి...
అతని పిల్లలు పెద్దవాళ్లయ్యారు!
అతని జీతం ఇంటి ఖర్చులకి సరిపోదు.
ఏదో పిల్లల్ని చదివిస్తున్నాడు.
అతనికి తాతల నాటి ఆస్థి కింద,'బి.పీ - సుగర్ 'వ్యాధులొచ్చాయి.
అతను కాస్తా గుటుక్కుమంటే...
అతని ఇంటి పరిస్థితేమిటనే భయం అతడ్ని పట్టుకుంది.
అప్పో సప్పో చేద్దామనుకున్నాడు.
పి.ఎఫ్. లోను తీసుకోవాలనుకున్నాడు.
చీటీ కట్టి విలువ తక్కువకి పాడాలనుకున్నాడు.
ఇన్సూరెన్సు పాలసీ మీద కూడా లోను పొందాలనుకున్నాడు.
ఆ అమ్మాయి పెళ్లి ఏడాది తిరక్కుండా చేయాలనుకున్నాడు!
ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కాకుండా తిరిగాడు.
'హోరి దేవుడో! ఈ అమ్మాయికి భర్తెక్కడున్నాడో చూపించరా! చూపించు! ' అంటూ ఏడ్చాడు.
అతడిని మగపిల్లలని కన్న తండ్రులు 'మీ అమ్మాయికి ఉద్యోగముందా?', 'ఎన్ని డిగ్రీలున్నాయి?', 'ఎంత కట్నం ఇస్తావు?!' అంటూ వేధించారు. ఆడపిల్లని కనడమంత బుద్ధితక్కువ మరోటుండదని అతడు చెంపలు వాయించుకున్నాడు.
**********
'దే-వు(- డు, 'కరుణించాడు...
పాతిక వేల కట్నంతో ఆ అమ్మాయిని - అతడు గడప దాటించాడు.
పెళ్లికొడుకు పోలియో వాడైనా... ప్రయివేటు కంపెనీలో చిరుద్యోగి!
ఊరి వారు 'కాకిముక్కుకు దొండపండు' అంటుంటే...
అతడు మాత్రం ఎంతో పొంగిపోయాడు! ఈ పెళ్లైనా కావడం అమ్మాయి అదృష్టమన్నాడు.
అమ్మాయి నోరుని మెదపనివ్వలేదు.
అమ్మాయికి ఇష్టాయిష్టాలుండకూడదన్నారు.
పెద్దలే పిన్నల మంచి చూస్తారన్నారు.
కొండ మీది కోతిని అతను కొనిపెట్టలేనని కూతురుకు చెప్పి నోరు మూయించాడు. బీద తండ్రి కడుపున పుట్టినందుకు ఆశలని చంపుకోవాలన్నాడు.
'పెళ్లి = రాజీ! = స్వర్గంలో దేవతల నిర్ణయం!' అని అమ్మాయికి నచ్చ చెప్పారు.
ఆ తండ్రికే.. ఆ అమ్మాయి తల్లీ వంత పాడింది!
మిగతా చెల్లెళ్ల పెళ్లిళ్ల గురించి నచ్చచెప్పడంతో... ఆ అమ్మాయి తల వంచుకుంది. వంగిన ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్లు బిగిశాయి!
***********
ఆ అమ్మాయి.. ఆ తల్లి దండ్రుల కూతురు పెళ్లయ్యాక ఒక గృహిణి! ఇప్పుడా గృహిణి తనకున్న ఆస్థిపాస్థులేమిటో అలోచించుకుంది.
బాధ్యతల వలయంలో చిక్కుకున్న ఆమె భర్తే ఆమెకో పెన్నిధి!
పెళ్లి కావలసిన ఆడపడుచు.. చదువుకుంటున్న మరిది... వృద్ధాప్యంతో రోగాలతో బాధపడే అత్తమామలు... వీరంతా ఆమె ధనరాసులు!
ఆమె చదువుకునే రోజుల్లో... ఆమె అందాన్ని చూసి వెంటపడ్డ ఎందరో కుర్రాళ్లు ఆమె కళ్ల ముందు తచ్చట్లాడారు-
'మోహన్...', 'రాజు..', 'జాన్సన్...'. 'రహీమ్...'
ఇలా ఒకరేమిటి? ఎందరో?! బాడీగార్డుల్లా...
ఆమెని బడి నించి ఇంటికీ.. ఇంటి నించి బడికీ... దిగబెట్టేవారు!
వారిలో ఏ ఒక్కరికీ ఆమెను పెళ్లాడే ధైర్యం మాత్రం లేదు. తండ్రి చాటు బిడ్డలు. నిరుద్యోగ యువకులు. ఆర్థిక స్వాతంత్ర్యం లేని అస్వతంత్రులు. అసమర్థులు!
చదువుకునే రోజులు..
ఆమె తన అందానికి తానే మురిసిపోయిన రోజులు...
పెళ్లికి ముందు కన్న రంగుల కలలు... అవన్నీ తలచుకుని ఆ గృహిణి నవ్వుకుంది.
'దే-వు-డు'... తనకి విధించిన శిక్షకి ఆమె పడీ-పడీ నవ్వింది!
కలలకీ నిజానికీ తేడా ఆమెకి తెలిసింది.
జీవితం సినిమా కాదనుకుంది.
ఒక నిండు గృహిణిగా.. గృహ కృత్యాల్లో జొరబడింది.
**********
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|