Active Blogs | Popular Blogs | Recent Blogs గురజాడ అప్పారావు గారి అగ్నిహోత్రావధానులుది విజయనగరమా ? విజయవాడా ? గురజాడ గారి ప్రకారం విజయనగరమే ! పి. పుల్లయ్య గారి ప్రకారం విజయవాడ ! 'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు ఒక పాత్రయితే ' కన్యాశుల్కం ' చిత్రంలో అది పాత్ర కాదు. సజీవమూర్తి. ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన నటుడు విన్నకోట రామన్న పంతులు. ఆ చిత్రం చూసిన వాళ్లకు ఆయన అసలు పేరు గుర్తులేదు. ఆయన పేరు అగ్నిహోత్రావధానులు. అంతే ! విజయవాడలో రామన్న పంతులు గారు వృత్తి రీత్యా వకీలు. ప్రవృత్తి రీత్యా నటుడు, దర్శకుడు మరెన్నో !
' పాతాళ భైరవి ' చిత్ర శతదినోత్సవం విజయవాడ లో వైభవంగా జరిగింది. ఆ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణ ' నాటకం ' అనే నాటకం. ఈ ' నాటకం ' నాటకీయంగా సినిమా రంగానికి కొందరు పెద్దమనుషుల్ని అందించింది. ఆ నాటకం చూసిన పాతాళ భైరవి దర్శకుడు కే. వి. రెడ్డి గారు తమ ' పెద్దమనుషులు ' చిత్రం ద్వారా ఆ నాటక రచయిత డి. వి. నరసరాజు గార్ని, నటుడు రామచంద్ర కాశ్యపను హీరోగానూ పరిచయం చేశారు. కానీ అదే నాటకంలో మరో ప్రధాన పాత్ర పోషించిన మన లాయర్ గారికి అప్పుడు పిలుపు రాలేదు. తర్వాత కాలంలో కె. వి. రెడ్డి గారు అన్నపూర్ణా వారికి ' దొంగ రాముడు ' మొదలుపెట్టినపుడు రామన్న పంతులు గారికి పిలుపు వచ్చింది. అందులో జగ్గయ్యకు అన్నయ్యగా వేషం దొరికింది. ' కన్యాశుల్కం ' చిత్రం ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టింది. అయినా ఆయన తన వృత్తిని, ఊరిని వదులుకోలేదు. ముఖ్యంగా రంగస్థలాన్ని అసలు వదలలేదు. అయితే ఆయన నటన అంటే అభిమానం ఉన్న సినిమా రంగం ఆయన్ని పూర్తిగా వదులుకోదలచలేదు. రామన్న పంతులు గారు తన నటనా వైదుష్యం వాహినీ వారి ' బంగారు పాప ' , అన్నపూర్ణా వారి ' చదువుకున్న అమ్మాయిలు ' , భరణీ వారి ' బాటసారి ' , బాపు గారి ' సాక్షి '. ' బంగారు పిచిక ' మొదలైన చిత్రాల్లో ప్రదర్శించారు. ఆయన ఎన్ని వేషాలు వేసినా ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ ఆయన విన్నకోట రామన్న పంతులు కాదు నులక అగ్నిహోత్రావదానులే !
Visit my blog at http://sirakadambam.blogspot.com/ and leave your valuable comment
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|