నయనకు సొమ్ము ఇచ్చిందెవరు?
నటి నయనతార, లింగుస్వామి మధ్య తమిళ 'పయ్యా' చిత్రం విషయంలో తలెత్తిన వివాదం ఆమె బ్యాన్ కు దారితీసి రెండ్రోజుల తర్వాత ఆ నిషేధం ఎత్తివేతతో సుఖాంతమైంది. దీంతో నయనతో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు నిర్మాతలు కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు.తమిళ 'బిల్లా' చిత్రంతో కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ కు ఎదిగిన నయనతారను లింగుస్వామి 'పయ్యా' కోసం ఎంపిక చేసి
20 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం, తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఆమెకు ఉద్వాసన చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇమ్మనడంతో గొడవ మొదలైంది. ఈ సినిమా కోసం మూడు నెలలు ఖాళీగా ఉండాల్సి వచ్చిందనీ, రెండు పెద్ద బ్యానర్ల సినిమాలు కూడా వదులుకున్నాననీ చెబుతూ నయనతార అడ్వాన్స్ తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో నయనపై లింగస్వామి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడం,
వారి వాదనను నడిగర సంఘం కూడా బలపరచడంతో నయనపై 'నిషేధం' విధించారు. సదరు చిత్ర నిర్మాత, నయనతార మధ్య రాజీ ఫార్ములా కుదరడంతో అడ్వాన్స్ సొమ్ము తిరిగి ఇచ్చేయడం ద్వారా నయనతారపై నిషేధం ఎత్తేశారు. ఆసక్తికరంగా ఈ మొత్తాన్ని ఎవరు చెల్లించారనే విషయంలో నయనతార పెదవి విప్పలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ మొత్తాన్ని తమిళ యువ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెల్లించినట్టు తెలుస్తోంది.
ఉదయనిధి స్టాలిన్ గత శనివారంనాడే సూర్య హీరోగా 'ఆదవన్' అనే కొత్త సినిమాను చైన్నైలోని ఎవిఎం స్టూడియోస్ లో ప్రారంభించారు. దీనికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా తొలిసారి నయనతార నటిస్తోంది. నయనతారపై నిషేధం వల్ల తన సినిమాకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావించిన ఉదయనిధి ఆమె చెల్లించాల్సిన బకాయి మొత్తాన్ని చెల్లు చేశారట. అయితే ఈ మొత్తాన్ని నయనతారకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ నుంచి మినహాయించుకునే ఆలోచన కూడా ఆయనకు లేదట. మొత్తానికి 'పయ్యా' నిర్మాత నయనతారను చిక్కుల్లో పడేస్తే 'ఆదవన్' నిర్మాత ఆమెను ఒడ్డున పడేశారు. నయనతార లక్కీనే...
Be first to comment on this News / Article!
|