అధినాయకుడే అధినేత
'అధినాయకుడు' అనే టైటిల్ నిన్న మొన్నటి వరకూ జనంలో బాగా ప్రచారంలోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన పొలిటికల్ ఎంట్రీకి సమాంతరంగా ఈ చిత్రంలో నటించబోతున్నారన్న వార్తలే కారణం. పార్టీ సిద్ధాంతాలు, నిజమైన ప్రజా ప్రతినిధులు ఎలా ఉండాలనే కథాంశంతో పరుచూరి సోదరలు ఈ స్క్రిప్టు రెడీ చేశారు. తిరుపతిలో స్క్రిప్టు పూజా కార్యక్రమాలు జరిగాయి. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారమూ జరిగింది. అయితే కారణాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి రాలేదు. ఆ విషయమూ జనాలు మరిచిపోయారు. ఆసక్తికరంగా ఇప్పుడో విషయం ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. జగపతిబాబు కథానాయకుడుగా వి.సుమద్ర దర్శకత్వంలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న 'అధినేత' చిత్రమే చిరంజీవి కోసం అనుకున్న 'అధినాయకుడు' అని తెలుస్తోంది. దీనికి పరుచూరి సోదరులే కథ అందిస్తుండటం కూడా ఈ వాదనకు బలం చేకూరేదే.
సముద్ర కమర్షియల్ చిత్రాల బాణీ మార్చి 'మల్లెపూవు' అనే చిత్రం తీయడం ద్వారా చేతులు కాల్చుకున్నారు. 'వెంకటాద్రి' సినిమా సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకొని మీనమేషాలు లెక్కపెడుతూ ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సముద్రకూ ఓ కమర్షియల్ బ్రేక్ కావాలి. దీనిని దృష్టిలో పెట్టుకునే 'ఎవడైతే నాకేంటి' చిత్రానికి పనిచేసిన పరుచూరి సోదరులను ఆయన సంప్రదించడం, చిరంజీవి కోసం పరుచూరి సోదరులు రెడీ చేసిపెట్టుకున్న స్క్రిప్టు ఓకే కావడమూ జరిగినట్టు సమాచారం. జగపతిబాబు ఈ చిత్రంలో తొలిసారి రాజకీయనాయకుడిగా నటించబోతున్నారు. ఓ సామాన్య యువకుడు పట్టుదలగా సిఎం స్థాయికి ఎలా ఎదగాడన్నదే 'అధినేత' సెంట్రల్ పాయింట్. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సముద్ర గట్టి పట్టుదలతో ఉన్నారు.
Be first to comment on this News / Article!
|