'ల్యాబ్స్'లో 600 సినిమాలు
ఇండియాలో అత్యధిక సినిమాలు తీసే పరిశ్రమగా టాలీవుడ్ కు రికార్డు ఉంది. ఇదే సయమంలో విడుదలకు నోచుకోక ల్యాబ్స్ లో మగ్గుతున్న సినిమాలు ఎక్కువగా ఉన్న రికార్డు కూడా తెలుగు పరిశ్రమకు చేరువవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనాల ప్రకారం సుమారు 600 సినిమాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి నేటికీ వెలుగుచూడటం లేదు. వీటిలో ఎక్కువ చిత్రాల రీళ్లు రామానాయుడు, ప్రసాద్, రైన్ బో, బాలాజీ ల్యాబ్స్ లో మూలనపడి కనిపిస్తాయి.
తెలుగు పరిశ్రమలో ఎక్కువగా క్రెడిట్ మీదే సినిమాల నిర్మాణం జరుగుతోందంటూ ఎపి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఎం.విజయేందర్ రెడ్డి తాజా పరిస్థితిని విశ్లేషించారు. 'ఇవాల్టి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. చాలామంది నిర్మాతలు సినిమా రిలీజ్ కు ముందే ఆర్టిస్టులకు రెమ్యునరేషన్ ఇవ్వలేకపోతున్నారు. నటీనటులతో పాటు సిబ్బంది ఇవ్వాల్సిన బకాయిన్నీ నిర్మాణ సంస్థ చెల్లించని పక్షంలో ల్యాబ్ రూల్స్ ప్రకారం సినిమా రిలీజ్ అనేది సాధ్యంకాదు' అని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఏర్పడిన స్లంప్ కూడా సినీ పరిశ్రమను మరింత కుదేలు చేస్తోంది. కొద్దికాలం క్రితం ఏర్పడిన రియల్ ఎస్టేట్ బూమ్ తో అనేక మంది రియల్ ఎస్టేట్ డీలర్లు సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్య ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీంతో ఆ రంగంలోని ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన భాను ప్రకాష్ రావు ఈ పరిస్థితిని వివరిస్తూ 'రెండేళ్ల కొత్త కొత్త నటీనటులతో టెర్రరిజం కథాంశంతో ఓ సినిమాను ప్రారంభించాను. ఇప్పుడు నా బిజినెస్ బాగాలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా నిర్మాణం మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది' అని ఆయన వివరించారు. ఆగిపోయిన వాటిల్లో కొద్దో గొప్పో పేరున్న ఆర్టిస్టుల సినిమాలు మాత్రం ఇన్వెస్టర్లను అడపాదడపా ఆకట్టుకుని బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే కొత్త ముఖాలతో తీసిన సినిమాలపై ఎప్పటికీ థియేటర్ల ముఖం చూసేందుకు నోచుకోవు. జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహించిన 'మహాత్మాగాంధీ ఆటోబయోగ్రఫీ', 'రాయలసీమ రక్తం', 'హోం మినిస్టర్', 'ప్రియురాలి' వంటి చిత్రాలు ఈ జాబితాలోనివే. నితిన్ 'సత్యమేవ జయతే', ముమైత్ ఖాన్ 'టార్గెట్', వేణు-ఛార్మిల 'మాయగాడు' చిత్రాలు సైతం ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నవే.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|