'సత్యమేవ జయతే' రివ్యూ
తీవ్రవాదం, అందువలన మానవాళికి ఎదురవుతున్న ముప్పు ఇవాల్టి ప్రధాన చర్చనీయాంశాలు. పలు కమర్షియల్ సినిమాలకు ఇలాంటివే ఇన్ గ్రేడియంట్స్ కూడా అవుతున్నాయి. యాదృచ్ఛికమో, ఉద్దేశ్యపూర్వకమో కానీ ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు ఖాకీ చిత్రాల్లో టెర్రరిజమే కామన్ పాయింట్. హీరోలిద్దరూ ఎన్ కౌంటర్ స్పెషలిస్టులే. దాదాపు రెండు పాత్రల లక్ష్యం కూడా ఒక్కటే. వీరి నోట పలికే..'ముస్లింలలో తీవ్రవాదులు ఉండొచ్చు. అయితే ముస్లింలంతా తీవ్రవాదులు కాదు' అనే సందేశంలోనూ అక్షరం ముక్క తేడా లేదు. వీటిలో ఒకటి 'అబ్ తక్ చప్పన్'కు జిరాక్స్ అయిన 'సిద్ధం' అయితే, ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖాకీ' రీమేక్ 'సత్యమేవ జయతే' మరొకటి. ఆసక్తికరంగా కొన్ని సన్నివేశాలు చొప్పించడం వల్లనే ఏమో కానీ హీరో రాజశేఖర్ 'సత్యమేవ జయతే' చిత్రానికి కథ అందించిన క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. మరో కీలక మార్పు కూడా ఉంది. ఆయన పేరు ముందు 'మహాస్టార్' కూడా వచ్చిచేరింది. అది ఎవరిచ్చారనేది అప్రస్తుతం. ఇక అలాగే పిలుచుకోవాల్సి రావచ్చు. ఇక ఈ చిత్రం ప్రారంభం నుంచి మీడియా, పబ్లిక్ ప్రత్యేక దృష్టి సారిస్తూ వచ్చారు. కాంగ్రెస్ లో రాజశేఖర్ దంపతులు చేరడం, సిఎం రాజశేఖర్ రెడ్డి సినిమా ముహూర్తానికి హాజరుకావడం, తొలి సన్నివేశం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎం.సత్యనారాయణరావు (సిఎం పాత్ర), హీరో రాజశేఖర్ లపై చిత్రీకరించడం, చిరంజీవి, ప్రతిపక్ష పార్టీలపై ఇందులో విసుర్లు ఉండవచ్చనే కథనాలు వినిపించడం, షూటింగ్ చివరి రోజు చోటుచేసుకున్న రాజశేఖర్, నీతూచంద్ర వివాదం వంటి అంశాలన్నీ మీడియా ద్వారా చర్చకు దారితీసి జనంలో సినిమాపై అంచనాలను పెంచాయి. ఆ అంచనాలకు సినిమా రీచ్ అయిందా అనేది ఓసారి చూద్దాం...
సత్య (రాజశేఖర్ ) ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్. డిపార్ట్ మెంట్ లోనే కాకుండా, జనంలోనూ అతనికి గ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. తన కళ్లముందు సామాన్య ప్రజానీకానికి ఏ హాని జరిగినా సహించడు. ఒకసారి సిఎం (ఎం.సత్యనారాయణరావు)పై తీవ్రవాదులు దాడి జరిపినప్పుడు సత్య ఆయనను కాపాడతాడు. సీఎం సైతం సత్యం చేసే ఎన్ కౌంటర్లను సమర్ధిస్తుంటాడు. ఒకరోజు తీవ్రవాదులు జరిపిన దాడిలో సత్య భార్య సంజన (సంజన) ప్రాణాలు కోల్పోతుంది. ఇందుకు సహకరించిన అవినీతి అధికారిని సత్య కాల్పిచంపుతాడు. డిపార్ట్ మెంట్ మనిషిని సత్య కాల్పిచంపినప్పటికీ సిఎం చొరవ తీసుకుని భార్య పోయిన షాక్ లో అతనికి మతిభ్రమించిందంటూ కొద్దిరోజులు వైద్య చికిత్సకు పంపించమని ఆదేశిస్తాడు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ సత్య డ్యూటీలో చేరుతాడు. హైద్రాబాద్ తరహాలోనే విశాఖలో బాంబు పేలుళ్లు జరగడంతో ఐఎస్ఐ ఏజెంట్ గా అనుమానిస్తున్న అన్సారీ (అతుల్ కులకర్ణి)ని అరెస్టు చేసి హైద్రాబాద్ కు తీసుకువచ్చే బాధ్యతను సత్యకు అప్పగిస్తారు. సత్య తన బెటాలియన్ (శివాజీ, సాయికిరణ్, శివారెడ్డి, నీతూచంద్ర)తో కలిసి వైజాగ్ బయలుదేరుతాడు. అన్సారీని పట్టుకుని తిరిగి తీసుకువస్తున్న క్రమంలో అతన్ని అప్పగించాల్సిందిగా తీవ్రవాద నాయకుడు రణ్ దేవ్ (మిలంద్ సోమన్ ) సత్యను హెచ్చరిస్తాడు. ఈ దశలోనే అన్సారీ అసలు నిజం బయటపెడతాడు. తాను ఐఎస్ఐ తీవ్రవాదని కాదనీ, తానో డాక్టర్ ననీ చెబుతాడు. అధికారంలో ఉన్న ఓ పొలిటీషియన్, మరో పోలీస్ ఉన్నతాధికారి కలిసి రణ్ దేవ్ తో తనను చంపించేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడిస్తాడు. అన్సారీ వద్ద ఉన్న రహస్యం ఏమిటి? అతన్ని చంపాలలకున్న కుట్రదారుల ప్లాన్ ను సత్య ఎలా తిప్పికొట్టి వారిని బోను ఎక్కించాడు? ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా అతను ఇచ్చిన తుది తీర్పు ఏమిటనేది మిగతా కథాంశం.
Read 2 Comment(s) posted so far on this News / Article!
Pages: 1 -2- -3-
|