'మిత్రుడు'గా బాలకృష్ణ
యువరత్న బాలకృష్ణ సరైన హిట్ చూసి చాలాకాలమే అయింది. దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావుతో చేసిన గత చిత్రం 'పాండురంగడు' మళ్లీ ఆయనకు కొత్త ఊపిరి పోసింది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కానప్పటికీ ఎన్టీఆర్ నట వారసుడిగా పౌరాణిక పాత్రల్లో మెప్పించగల సత్తా తనకే ఉందని మరోసారి చాటుకున్నారు. ఇప్పుడు పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రాజమౌళి శిష్యుడైన మహాదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంపై ఆయన గట్టి ఆశలే పెట్టుకున్నారు. బాలకృష్ణతో 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు', 'భలేవాడివి బాసూ' వంటి చిత్రాలు నిర్మించిన శివలెంక ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈనెల 28 వరకూ జరిగే షెడ్యూల్ లో పతాక సన్నివేశాలతో సహా టాకీ మొత్తం పూర్తవుతుంది. మార్చిలో బ్యాలెన్స్ పాటల చిత్రీకరణ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'మిత్రుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది.
బాలకృష్ణ సరసన ప్రియమణి తొలిసారి ఇందులో నటిస్తుంటడం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చి మొదటి వారంలోనూ, సినిమా ఏప్రిల్ రెండో వారంలో సమ్మర్ కానుకగానూ విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|