మహేష్ 'వధువు' మారింది
పరశ్రమలో ఈక్వేషన్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సక్సెస్ ఒక్కటే తారకమంత్రం. సక్సెస్ వచ్చినప్పుడు కొత్త సినిమాల విషయంలో మీనమేషాలు లెక్కపెట్టినా కూడా దారులు మూసుకుపోతుంటాయి. గ్లామర్ నటి పార్వతి మిల్టన్ ఈ సత్యం గ్రహించకపోవడం వల్లే ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి ఇప్పుడు చేజారిపోయింది. 'జల్సా' చిత్రంలో ఇలియానా కంటే పార్వతి మిల్టన్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. దాంతో ఒక్కసారిగా మహేష్ తదుపరి చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పార్వతి ఎగరేసుకుపోయింది. స్టార్ హీరోతో మెయిన్ హీరోయిన్ అవకాశం రావడం కూడా పార్వితికి ఇదే ప్రథమం. కారణాంతరాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చిలో సెట్స్ పైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మొదట్లో అనుకున్నట్టే ఈ చిత్రానికి 'వరుడు' అనే టైటిల్ నే కన్ ఫర్మ్ చేయబోతున్నారట. ఎటొచ్చీ పార్వతి మిల్టన్ ను సినిమా నుంచి తప్పించి ఆ ప్లేస్ లో అనుష్కను ఎంపిక చేయడమే తాజా ట్విస్ట్.
'అరుంధతి' సినిమా తర్వాత అనుష్కకు వచ్చిన అనూహ్యమైన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే అనుష్క ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది.'జల్సా' సమయంలో ఇచ్చిన హామీ మేరకే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత పార్వతికి ఆఫర్ ఇచ్చినప్పటికీ చివరకు ఆ నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదట. పార్వతిని మార్చాలని మహేష్ పట్టుబట్టారనీ, సినిమా వాయిదా పడడానికి ఇది కూడా ఓ కారణమనీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే నిజమైతే ఆ కోపం మనసులో పెట్టుకుని త్రివిక్రమ్ ఎలా సినిమా గట్టెక్కిస్తారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఏదిఏమైనా ఏడాదికి పైగా మరో సినిమాకి కమిట్ కాకుండా 'వరుడు' పై ఆశపెట్టుకున్న పార్వతికి నిరాశే మిగిలిందనీ, ప్రస్తుతం ఆ అలకతోనే న్యూయార్క్ వెళ్లిపోయిందనీ చెబుతున్నారు. షరామామూలుగా 'వరుడు'కు సెకెండ్ హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. మార్చిలో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రానికి సింగనమల రమేష్ నిర్మాత.
Be first to comment on this News / Article!
|