తెలుగు చిత్ర సీమలో టాప్ గ్రాసర్ గా నిలిచే దిశగా 'అరుంధతి' చిత్రం దూసుకుపోతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయఢంకా మోగిస్తుండటంతో రీమేక్ రైట్స్ కు కూడా గట్టిపోటీ నెలకొంది. అయితే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రం ఇంతవరకూ ఈ చిత్రం రీమేక్ హక్కులను ఎవరినీ ఇవ్వలేదు. తమిళ, మలయాళ భాషల్లోనూ ఏప్రిల్ 4న అనువాద రూపంలో సినిమాను సొంతంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు హిందీ వెర్షన్ ను సొంతంగా రీమేక్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీనికితోడు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు శ్యాంప్రసాద్ రెడ్డి 7 కోట్లు కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. ఒక తెలుగు చిత్రం శాటిలైట్ రైట్స్ ఇంత పెద్ద మొత్తానికి కోట్ చేస్తుండటం బహుశా ఇదే ప్రథమం.
ఆసక్తికరంగా శ్యాంప్రసాద్ రెడ్డి రెండేళ్ల క్రితమే కోటి రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను వేరే వాళ్లకు అమ్మేశారు. అయితే సినిమా రిలీజ్ కు ఓ వారం రోజుల ముందు శ్యాంప్రసాద్ రెడ్డి సదరు వ్యక్తితో సంప్రదింపులు జరిపి మరి కొద్ది మొత్తం ఎక్కువ ఇచ్చి తిరిగి రైట్స్ ను దక్కించుకున్నారు. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అమాంతం 7 కోట్లకు శాటిలైట్ రైట్స్ ను బేరం పెట్టారు. క్వాలిటీ కోసం తపన పడే నిర్మాతగానే కాకుండా శ్యాంప్రసాద్ రెడ్డిలో ఉన్న వ్యాపార దక్షతకు కూడా ఈ ఉదంతం అద్దంపడుతుంది.