ఛార్మి వంటి ఆకర్షణ ఉన్న హీరోయిన్ ను ఎంచుకుని కూడా ఆమె క్యారెక్టర్ కు సరైన దిశా నిర్దేశం చేయకపోవడం దర్శకుడి స్ర్కిప్టు బలహానతగానే చెప్పుకోవాలి. హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆమెను తీసుకున్నట్టు కనిపిస్తుందే కానీ ఆ పాత్రకు తగిన ప్రాధాన్యం లేదు. మొదట్నించీ చివరి వరకూ హీరో అరవింద్ పైనే కథ నడుస్తుంది. అతన్ని కష్టాల ఊబిలోంచి గట్టెక్కించేందుకు ఆమె వెన్నుదన్నుగా నిలిచే బలమైన సన్నివేశాలు జోడించినా ఆ పాత్రకు నిండుతనం వచ్చేది. దర్శకుడు ఆ దిశగా చేసిందేమీ లేదు. ఛార్మి ఏ పని చేస్తుందో ఎవరికీ తెలియదు. బోల్డన్ని క్రెడిట్ కార్డులు మాత్రం ఉంటాయి. బైక్ నడుపుతుంటే....ఆలవోకగా ఓ స్పైసీ డాన్స్ వచ్చిపడిపోతుంది సందర్భ శుద్ధి లేకుండా. వీటికి తోడు విలన్ రామిరెడ్డి తనయుడు చేసే వికార చేష్టల ట్రాక్ మరొకటి.
ఛార్మి పాత్ర ఈసారి అంతగా పండకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పాత్రకు సరైన వెయిట్ లేకపోవడం కూడా ఓ కారణం కావచ్చు.పలవురు స్టార్ హీరోలను ఛార్మి ఇమిటేడ్ చేసి చెప్పే సంభాషణలు కర్ణకఠోరంగా అనిపిస్తాయి. కృత్రిమత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఛార్మి గత సినిమాల్లో చేసిన సిజ్లింగ్ సాంగ్స్ తో పోల్చుకుంటూ ఇందులో చూపించిన రెండు సాంగ్స్ కూడా తీసికట్టే. హీరో అరవింద్ బక్కపలచని ఆహార్యం అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. సినిమాలోని నిక్ నేమ్ (కాక్రోచ్ )కు తగ్గట్టుగానే గడ్డంతోనే చివరి వరకూ కనిపిస్తాడు. అయితే తన పాత్రలోని అమాయకత్వాన్ని బాగానే పండించాడు. కోట శ్రీనివాసరావు తనకున్న ఆపారమైన నటనానుభవంతో తన పాత్రకు న్యాయం చేశారు. ఎస్.ఐ. గాబ్రియేలుగా ధర్మవరపు సుబ్రమణ్యం ఒకటి రెండు నవ్వులు నవ్వించారు. పలువురు తమిళ నటులను సినిమాలో మిక్స్ చేశారు.