'16 డేస్' రివ్యూ
తెలుగు సినిమా అడపాదడపా హాలీవుడ్ తోలు కప్పుకుంటూనే ఉంది. స్ట్రయిట్ లిఫ్టింగ్ లు కొన్నయితే, బేసిక్ కాన్సెప్ట్ ను తెలివిగా ఎత్తేసి కొన్ని ట్రాక్ లు తగిలించి కథ తమదేనంటూ క్రెడిట్ కార్డ్ ఇచ్చేసుకోవడం మరికొన్ని సందర్భాలో కనిపిస్తుంది. ఛార్మి కథానాయికగా ప్రభు సోలమన్ దర్శకత్వంలో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన '16 డేస్' కూడా హాలీవుడ్ తానులోని ముక్కే. మూడేళ్ల క్రితం పాల్ మెక్ గిగాన్ దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ నెంబర్ స్లెవిన్' చిత్రం స్ఫూర్తితోనే ప్రభు సోలమన్ కథ అల్లుకున్నారు. తేడా అల్లా...ఒరిజనల్ వెర్షన్ లోని రెవేంజ్ స్టోరీకి బదులు కొన్ని సెపరేట్ ట్రాక్ లు చేర్చారు. తమిళంలోనూ ఈ చిత్రం 'లాడమ్ ' పేరుతో రిలీజ్ చేశారు. 'మంత్ర' తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ ఇమేజ్ ను ఛార్మి సొంతం చేసుకోవడం, ఈ సినిమా పబ్లిసిటీ స్టిల్స్ సహజంగానే జనంలో మరో థ్రిల్లర్ చూడనున్నామనే అభిప్రాయాలకు తావిచ్చింది. ఛార్మి నుంచి మంచి స్టీమీ సన్నివేశాలు ఉంటాయనీ, ఆమెదే ప్రధాన భూమిక అనీ అనుకోవడమూ సహజం. అందుకు తగ్గట్టుగా '16 డేస్' ప్రయాణం సాగిందా అంటే....తల అడ్డంగా ఊపాల్సిందే. అదెలా? అంటే కొంచెం లోతుపాతుల్లోకి వెళ్లాలి.
ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ల మధ్య అమాయకంగా చిక్కుకున్న ఓ యువకుడు చివరకు ఆ పరిస్థితుల నుంచి విజేతగా ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా (లక్కీ నెంబర్ స్లెవిన్...తరహాలోనే) స్టోరీలైన్. పావడా యాదగిరి (కోట శ్రీనివాసరావు), రామిరెడ్డి మధ్య ఇరవై ఏళ్లుగా పగలు రగులుతుంటాయి. గ్యాంగ్ లీడర్సయిన ఈ ఇద్దరూ ఎదురరెదురు ఇళ్లలో ఉంటూ ఒకరి చావును మరొకరు కోరుకుంటూ ఉంటారు. యాదగిరి కొడుకును రామిరెడ్డి చంపిస్తాడు. దాంతో యాదగిరి తోకతొక్కిన తాచుపాములా బుసకొడతాడు. తన కొడుకు కర్మకాండ తొలిరోజునే 16 రోజుల్లోగా రామిరెడ్డి కొడుకును కూడా పాడె ఎక్కిస్తానని శపథం చేస్తాడు. అన్ని రాష్ట్రాల నుంచీ ప్రొఫెషనల్ కిల్లర్స్ ను రప్పిస్తాడు. అయితే వాళ్లంతా రామిరెడ్డి ముఠా చేతుల్లో హతమవుతుంటారు. ఈ క్రమంలో ఉద్యోగం కోసమని గుత్తి గురుమూర్తి (అరవింద్) అనే యువకుడు హైద్రాబాద్ వచ్చి యాదరిగి మనుషుల చేతుల్లో పడతాడు. నిజానికి గురుమూర్తి అన్నయ్య కోసం వచ్చిన ఆ ముఠా సభ్యులు పొరపాటున అతన్ని పట్టుకుని యాదగిరి దగ్గరకు తీసుకువెళ్తారు. అక్కడే యాదగిరి పగ గురించి తెలుసుకున్న గురుమూర్తి తెలివిగా అతని నుంచి బయట పడేందుకు తనకు తోచిన సలహా ఒకటి పడేస్తాడు. దాంతో రామిరెడ్డి కొడుకును చంపే పని గురుమూర్తి నెత్తిన పడుతుంది. చంపకుంటే నిన్నే లేపేస్తామని యాదగిరి హెచ్చరిస్తాడు. గురుమూర్తి తిరిగి ఇంటికి వస్తుండగా రామిరెడ్డి మనుషులకు చిక్కుతాడు. వాళ్లు అతన్ని సజీవంగా ఓ గోతిలో పాతిపెట్టేస్తారు. గురుమూర్తి తెలివిగా బయటపడి ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లోనే అతనికి ఏంజెల్ (ఛార్మి) పరిచయమవుతుంది. 'సత్రం భోజనం...మఠం నిద్ర' ఏంజెల్ పాలసీ. ఆమెకు నా అనేవాళ్లు ఎవరూ ఉండరు. అన్ని ఇళ్లూ ఆమెవే. ఏ ఇంట్లో జనాలు లేకపోతే ఆ ఇంట్లోకి ప్రవేశించి అక్కడే కాలక్షేపం చేసేస్తూ ఉంటుంది. గురుమూర్తి తన స్టోరీ ఆమెకు చెబుతాడు. ఈ క్రమంలోనే ఒకరికొకరు దగ్గరవుతారు. మరోవైపు 16 రోజుల డెడ్ లైన్ పూర్తి కావస్తుంటుంది. చివరకు ఈ సమస్య నుంచి గురుమూర్తి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|