డల్లాస్ లో 'మేస్త్రి' ఆడియో
డల్లాస్, టెక్సాస్: దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు టైటిల్ పాత్రలో సురేష్ కృష్ణ దర్శకుడిగా సిరి మీడియో పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ నిర్మించిన 'మేస్త్రి ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం డల్లాస్ లోని ఇండియన్ రెస్టారెంట్ లో సోమవారం రాత్రి కన్నులపండువగా జరిగింది. ఇదే ముహూర్తానికి ఇండియాలోనూ ఈ చిత్రం ఆడియో విడుదలైంది. అమెరికాలో ఆడియో విడుదలైన తొలి తెలుగు సినిమా క్రెడిట్ 'మేస్త్రి'కి దక్కుతుంది. డల్లాస్ లోని పలువురు తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ ఆడియో వేడుకలో పాల్గొన్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సెక్రటరీ ప్రసాద్ తోటకూర ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్ టెక్స్) అధ్యక్షులు శ్రీధర్ కొర్సపాటికి అందజేశారు. ఆడియో క్యాసెట్ ను ఎవరెస్ట్ హైట్స్ గ్రూప్ చైర్మన్ జైపాల్ రెడ్డి ఆవిష్కరించి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) డల్లాస్ రీజనల్ కోఆర్డినేటర్ సతీష్ రెడ్డికి అందజేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో దాసరి నారాయణరావు సాధించిన విజయాలు, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'మేస్త్రి' చిత్రం ఎలాంటి ప్రాధాన్యం సంతరించుకోనుందనే విషయాలను ప్రసాద్ తోటకూర వివరించారు. జాతీయ అవార్డు గ్రహీత, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇండియాలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి ఫోనులో ఆడియో వేడుకకు హాజరైన వారితో ముచ్చటించడం విశేషం. సినిమాలోని ఒక్కో పాటకు ఉన్న విశేషాన్ని, అందులోని సందేశాన్ని ఆయన వివరించి చెప్పారు. సినిమాలోని 7 పాటల్లో 6 పాటలకు సుద్దాల రచన చేశారు. డాక్టర్ దాసరి గతంలో తీసిన 'ఎమ్మెల్యే ఏడుకొండలు' చిత్రం గురించి, అందులోని సందేశం గురించి స్థానిక తెలుగు కమ్యూనిటీ నాయకుడు సి.ఆర్.రావు ముచ్చటించారు. ఇదే తరహా పొలిటికల్ నేపథ్యంలో దాసరి నుంచి వస్తున్న 'మేస్త్రి' చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'దేవదాసు మళ్లీ పుట్టాడు' వంటి చిత్రాన్ని తీయగలిగిన ధైర్యం ఒక్క దాసరికే సాధ్యమని అన్నారు. 'మేస్త్రి' చిత్రంలో మోహన్ బాబు పోషించిన పాత్ర గురించి శ్రీధర్ కొర్సపాటి వివరించారు. దాసరికీ, ఆయన టీమ్ కూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిపెట్టాలని అభిలషించారు. ఈ కార్యక్రమాన్నిటూరింగ్ టాకీస్ కు చెందిన మనో హర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి నిర్వహించారు. సిరిమీడియో ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మార్చి 6న 'మేస్త్రి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Be first to comment on this News / Article!
|