నితిన్ కు 'అజ్ఞాతం' వీడేనా?
తెలుగులో ఎన్ని ఫ్లాపులిచ్చినా మళ్లీ మళ్లీ సినిమా అవకాశాలు దక్కించుకున్న హీరోగా నిన్నమొన్నటి వరకూ నవదీప్ పేరు ప్రచారంలో ఉండేది. నవదీప్ ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఇప్పుడు నితిన్ వంతు. తొలి సినిమా 'జయం'తో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న నితిన్ ఆ తర్వాత 'దిల్', 'సై' వంటి హిట్లు సాధించారు. అయితే కృష్ణవంశీ 'శ్రీ ఆంజనేయం' నుంచి నితిన్ కు సరైన హిట్ దొరకని పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. ఆహార్యంలో మార్పులు తెచ్చుకుంటూ, సిక్స్ ప్యాక్ డవలప్ చేయడం, డాన్స్ లలో ప్రూవ్ చేసుకుంటున్న నితిన్ కథల విషయంలో సరైన జడ్జిమెంట్ కనబరచకపోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. 'అల్లరి బుల్లోడు', 'ధైర్యం', 'రామ్', 'టక్కరి', 'ఆటాడిస్తా', 'విక్టరీ', 'హీరో' చిత్రాలు నితిన్ కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'ద్రోణ' ఓపినింగ్స్ ను రాబట్టినా షరామామూలుగా రిజల్ట్ నీరసంగా ఉందంటూ ట్రేడ్ వర్గాలు తేల్చిచెబుతున్నాయి. అయితే నితిన్ భవిష్యత్ పట్ల ఆశావహంగానే ఉన్నారు. నితిన్ ను బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న 'అజ్ఞాత్'తో పాటు, పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న 'మిర్చి' (అధికారికంగా ఇంకా ప్రకటించలేదు) చిత్రాలు నితిన్ చేతిలో ఉన్నాయి. 'అజ్ఞాత్'లో నితిన్ సరసన నిషా కొఠారీ అలియాస్ ప్రియాంక నటిస్తుండగా, పరుచూరి మురళి చిత్రంలో నితిన్ కు జోడిగా మెరుపుతీగ ఇలియానా నటిస్తోంది.
'అజ్ఞాత్' చిత్రం ముందుగా విడుదలయ్యే అవకాశాలుండటంతో నితిన్ సైతం ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు. ఇటీవల సరైన హిట్లు అందించడంలో వెనుకబడిన వర్మ సైతం ఈసారి పట్టుదలగా 'అజ్ఞాత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నరు. శ్రీలంకలోని సిగిరియా అడవుల్లో ఈ చిత్రంలోని ఎక్కువ భాగాన్ని వర్మ చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కోసం వెళ్లిన ఒక యూనిట్ అడవుల్లో చిక్కుకుపోతుంది. ఒక్కొక్కరే హత్యకు గురవుతుంటారు. ఆ మిస్టరీ ఏమిటనేదే 'అజ్ఞాత్' ఇతివృత్తం. ఇందులో నితిన్ అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. 'హీరో' సినిమా కోసం నితిన్ పెంచిన కండలు చూసి ముచ్చటపడిన వర్మ ఎకాఎకిన అతన్ని బాలీవుడ్ కు పట్టుకుపోయారు. వర్మ చిత్రంతోనైనా నితిన్ కు బ్రేక్ వస్తే మంచిదే...
Be first to comment on this News / Article!
|