'ఛక్ దే' నాగ్?
మాస్...బాస్..కింగ్ తర్వాత నాగార్జున ఎత్తబోయే కొత్త అవతారం ఏమై ఉంటుంది? స్పోర్ట్స్ హీరోగా అయ్యిండొచ్చా? ఫిల్మ్ సర్కిల్స్ లో ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా గత డిసెంబర్ లో విడుదలైన 'కింగ్' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకూ ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. అయితే 'కింగ్ ' నిర్మాత శివప్రసాద్ రెడ్డితో మరో చిత్రానికి మాత్రం ఆయన కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధింన స్క్రిప్టు, దర్శకుడి ఎంపిక పనిలో శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజుతో ఓ చిత్రానికి పని చేసేందుకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వినిపిస్తోంది.
గుణ్ణం గంగరాజు 'లిటిల్ సోల్జర్స్ ', 'అమ్మ చెప్పింది' చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు, 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. 'అమ్మ చెప్పింది' చిత్రం కమర్షియల్ సక్సెస్ కాకపోయినా, దేశభక్తి ప్రబోధాత్మక సందేశంతో సినిమా రూపొందటంతో ఆయనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇదే క్రమంలో ఆయన బాలీవుడ్ లో సంచనల విజయం సాధించిన 'ఛక్ దే ఇండియా' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయనీ, ఆయన చెప్పిన కథాక్రమం నాగర్జునకు నచ్చి దర్శకత్వం చేపట్టాలని కూడా కోరారననీ అంటున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో షారూక్ ఖాన్ హాకీ కోచ్ గా హిందీలో నటించిన 'ఛక్ దే ఇండియా' చిత్రం 2007 ఆగస్టు 10న విడుదలై ఘనవిజయం సాధించింది. షిమిత్ అమిన్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఆ చిత్రాన్ని నిర్మించారు. దీనికి రీమేక్ గానే నాగార్జున-గుణ్ణం గంగరాజు చిత్రం ఉంటుందా, ఆ చిత్రం స్ఫూర్తితో కొత్తగా సినిమాను తెలుగులో ప్రెజెంట్ చేస్తారా అనేది వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|