చరణ 'మగధీర' ఏప్రిల్ 9న
తొలి చిత్రం 'చిరుత'తో కమర్షియల్ సక్సెస్, 2007 నంది అవార్డు స్పెషల్ జ్యూరీ అందుకున్న రామ్ చరణ్ 'మగధీర' చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నారనే ఉత్సుకత రోజురోజుకూ సినీ అభిమానుల్లో పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టే నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ చిత్రంగా 'మగధీర'ను తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను మార్చి 20న సుప్రీం మ్యూజిక్ ద్వారా 5 లక్షల పైచిలుకు సీడీలను విడుదల చేయాలనీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ అనువాదరూపంలో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయాలనే పక్కా ప్లానింగ్ తో నిర్మాత ఉన్నట్టు తెలుస్తోంది.
'చిరుత' చిత్రాన్ని 224 ప్రింట్లతో ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయగా, రెట్టింపు ప్రింట్లతో 'మగధీర' విడులయ్యే అవకాశాలున్నాయి. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. 400 ఏళ్ల క్రితం కథ ప్రారంభమై ఇప్పటి జనరేషన్ వరకూ కథాక్రమం నడుస్తుంది. గత జన్మలో ప్రేమను పండించుకోలేని ఓ యువజంట మళ్లీ పుట్టి తమ ప్రేమను ఎలా సఫలం చేసుకున్నారనేది ఇందులో కీలకాంశం. రామ్ చరణ్ ఇందులో యాక్షన్ హీరోగా కూడా కనిపించబోతున్నారు. ఇందుకోసం గుర్రపు స్వారీ, కరాటేలోనూ శిక్షణ పొందారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి. అలాగే రామచరణ్, కాజల్ జంట కన్నులపండువగా ఉంటుందనీ, రామ్ చరణ్ తో 'బంగారు కోడిపెట్ట...' అనే రీమిక్స్ సాంగ్ లో చిరంజీవి కలిసి స్టెప్స్ వేయడం మరో ప్రధాన హైలైట్ అవుతుందనీ తెలుస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించగా, ఎం.రత్నం సంభాషణలు రాశారు. 'ఛత్రపతి' ప్రసాద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|