మళ్లీ గోపీచంద్ విలనీ?
హీరోగా 'తొలి వలపు' చిత్రంలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన గోపీచంద్ కు రియల్ స్టార్ డమ్ మాత్రం విలనీ పాత్రలతోనే వచ్చింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం'లో ఆయన చూపిన విలనీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత 'వర్షం', చివరిగా 'నిజం' చిత్రాల్లో ఆయన విలనీ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే మళ్లీ హీరో పాత్రల వైపు మళ్లారు. 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం' 'శైర్యం' వంటి హిట్లు సొంతం చేసుకున్నారు. మళ్లీ ఆయన విలనీ పాత్రలు చేస్తే చూడాలనే అభిమానులకు కూడా కొదవలేదు. తాజాగా ఆయనను విలనీ పాత్రలో చూపించేందుకు తేజ మరోసారి ఒప్పించారని సినీ వర్గాల భోగట్టా.
'కేక' చిత్రం తేజ అంచనాలను తలకిందులు చేస్తూ ఇటీవల ఫెయిల్యూర్ చవిచూసింది. అయితే తేజలో పట్టుదల మాత్రం తగ్గలేదు. ఎలాగైనా సరే మళ్లీ ఓ పెద్ద హిట్ తో తన సత్తా చాటాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన తదుపరి చిత్రం కోసం విక్టరీ వెంకటేష్ ను ఒప్పించారని కొద్దిరోజులుగా వినిపిస్తోంది. నిజానికి 'జయం' సినిమా తర్వాత తేజతో సినిమా చేయాలని వెంకటేష్ ఆశించారు. అయితే
అది కార్యరూపంలోకి రాలేదు. ఈ క్రమంలో ఆకుల శివ రాసిన ఓ కథను తేజ ఇటీవల వెంకటేష్. ఆయన సోదరుడు సురేష్ బాబుకు వినిపించి ఆ ప్రాజెక్ట్ ను ఓకే చేయించుకున్నట్టు తెలుస్తోంది. సురేష్ బాబు నిర్మాతగా తేజ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ చిత్రం మార్చి 12న ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో వెంకటేష్ ను ఢీకొనే విలన్ గా గోపీచంద్ నటించబోతున్నారట. ఇదే నిజమైన ఇది నిశ్చయంగా క్రేజీ కాంబినేషనే అవుతుంది. సంచలనాలకూ కొదవుండకపోవచ్చు.
Be first to comment on this News / Article!
|