దత్ 'పొలిటికల్' పిక్చర్?
మూడు దశాబ్దాలకు పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థగా వైజయంతీ మూవీస్ కూ, ఆ సంస్థ అధినేత సి.అశ్వనీదత్ కూ మంచి పేరుంది. అలనాటి ఎన్టీఆర్ (ఎదురులేని మనిషి) నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ (కంత్రి) వరకూ మూడు తరాల హీరోలతో పనిచేసిన క్రెడిట్ ఆయనకు దక్కుతుంది. మహేష్ ను 'రాజకుమారుడు'తోనూ, రామ్ చరణ్ ను 'చిరుత' తోనూ పరిచయం చేశారు. రజనీకాంత్ 'కథానాయకుడు' చిత్రానికి నిర్మాతగా కూడా ఆయన తన సాహసాన్ని చాటుకున్నారు. దత్ తాజాగా మరో కొత్త హీరోని తన బ్యానర్ నుంచి పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బలంగా చర్చ జరుగుతుంది. నిజానికి కొత్త హీరోని పరిచయం చేయడం సాధారణ విషయమే అయినా ఈసారి మాత్రం రొటీన్ కు భిన్నంగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకును పరిచయం చేయనున్నారనే వార్తే ఈ సంచలనానికి కారణం. ఇంతకూ ఈ పొలిటికల్ దిగ్గజం ఎవరనేది కూపీ లాగినప్పుడు నారా రామ్మూర్తి నాయుడి కుమారుడి పేరు వినిపిస్తోంది.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడే రామ్మూర్తి నాయుడు. అశ్వనీదత్ కూ నారా వారి కుటుంబానికీ మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎంపిగా విజయవాడ నుంచి దత్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక రామ్మూర్తి నాయుడు సైతం ఈసారి చంద్రగిరి నుంచి పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ చివరి నిమిషంలో రోజా ఆ అవకాశం తన్నుకుపోయింది. దీంతో అలిగిన రామ్మూర్తి నాయుడును సముదాయించే ప్రయత్నంలో భాగంగానే ఆయన కుమారుడు రోహిత్ ను హీరోగా పరిచయం చేసే పనిని దత్ కు నారా పెద్దాయన అప్పగించారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ద్వారా చైతన్య దంతులూరి అనే కొత్త యువకుడు దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. చైతన్య దంతులూరి ఇటీవల నిఖిల్ ('యువత' ఫేమ్) హీరోగా 'బసంతి' అనే చిత్రం దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్టు వినిపించినప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదు. ఈ క్రమంలో ఆయన చెప్పిన కథ నచ్చి అశ్వనీదత్ తన తాజా ప్రాజెక్ట్ ను ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. అంతా సజావుగా జరిగితే నారా వారి ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోని కూడా ప్రేక్షకులు చూడొచ్చు.
Be first to comment on this News / Article!
|