దాసరి 'మేస్త్రి' 11న విడుదల
నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఇతివృత్తంగా తీసుకుని దర్శకరత్న దాసరి నారాయణరావు టైటిల్ పాత్ర పోషించిన చిత్రం 'మేస్త్రి'. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాసరి పద్మ సమర్పకురాలు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. తొలుత ఈనెల 6న రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది.
పటిష్టమైన కథ, సజీవమైన పాత్రలతో సంచలనాత్మక చిత్రంగా 'మేస్త్రి' తెరకెక్కిందనీ, మైత్రి సంస్థ ద్వారా కేవలం పది రూపాయలకే ఇటీవల 5 లక్షల ఆడియో, క్యాసెట్లు, సీడీలు విడుదల చేశామనీ నిర్మాత తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా దుబాయ్, సింగపూర్, మలేసియా, యు.కె., యుఎస్ఎ తదితర దేశాల్లోనూ ఆడియో విడుదలకు సంచనలం సృష్టిస్తోందనీ, ఇప్పటికీ 3 లక్షల 50 వేలకు పైగా అమ్ముడయ్యానీ చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 200 ట్రైలర్స్ ను ముందుగానే విడుదల చేశామనీ, అన్ని చోట్ల నుంచీ ట్రైలర్స్ కు అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత దాసరి మళ్లీ కథలోని ప్రధాన పాత్రను ఎంతో కసిగా చేశారని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గిరిబాబు, చంద్రమోహన్, సాయాజీ షిండే, ప్రదీప్ రావత్, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ, కొండవలస, భరణి, సుత్తివేలు, గౌతంరాజు, నరసింహరావు, జెన్ని, సుజిత, సుధ తదితరులు నటించారు. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్ ప్లే అందించగా, రాజేంద్రకుమార్ మాటలు, సి.నా.రె.-సుద్దాల అశోక్ తేజ-డాక్టర్ దాసరి నారాయణరావు పాటలు, సి.హెచ్.రమణరాజు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, రాఖీ రాజేష్ స్టంట్స్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|