మహేష్ సినిమాలో స్వాతి
ప్రిన్స్ మహేష్ బాబు వీరాభిమానిగా 'అష్ట చమ్మ' చిత్రంలో కలర్స్ స్వాతి చేసిన అల్లరిని ప్రేక్షకులు అంత తేలిగ్గా మరిచిపోలేరు. అందులో తన పాత్రపరంగా మహేష్ నే పెళ్లాడతానంటూ పట్టుబట్టి అప్పటికే మహేష్ కు నమ్రతను పెళ్లాడినట్టు తెలుసుకుని బోలెడంత డీలా పడిపోతుంది. మహేష్ కాకపోయినా కనీసం ఆ పేరున్న వ్యక్తినే పెళ్లాడతాననే కండిషన్ తో పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ పాత్ర స్వాతికి మంచి పేరు తెస్తే...ఇప్పుడు ఎకాఎకిన మహేష్ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నట్టు సమాచారం.
మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతి తర్వలోనే 'వరుడు' చిత్రం సెట్స్ పైకి రాబోతోంది. ఈ చిత్రంలో తొలుత మహేష్ కు జోడిగా పార్వతి మిల్టన్ ను ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో పార్వతికి ఉద్వాసన పలికి అనుష్కను హీరోయిన్ గా తీసుకున్నారు. తాజాగా ఇప్పుడు కలర్స్ స్వాతి కూడా వచ్చి చేరినట్టు సమాచారం. అయితే మహేష్ సరసన కాకుండా ఆ చిత్రంలో
మహేష్ ఫ్రెండ్ గా పూర్తి స్థాయి పాత్ర పోషిస్తున్న కమెడియన్ సునీల్ కు జోడిగా ఆమె నటించబోతోందని తెలుస్తోంది. అంటే సునీల్, కలర్స్ స్వాతి కలిసి కామెడీని ఎడాపెడా పండించేస్తారని అనుకోవచ్చు. మహేష్ అభిమానిగా నటించిన కలర్స్ స్వాతిని ఇప్పుడు ఎకాఎకిన ఆయన సినిమాలోనే చూడటం ప్రేక్షకులకు కూడా ఉత్సుకత కలిగించే అంశమే అవుతుంది. ప్రస్తుతం కలర్స్ స్వాతి కథానాయిక పాత్రలో కూడా బిజీగా ఉంది. 'హోప్' చిత్రానికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కలవరమాయె మదిలో' చిత్రంలోనూ, ఇంకా పేరు పెట్టని మరో చిత్రంలోనూ స్వాతి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ఆమె నటించిన 'సుబ్రమణియపురం' సైతం ఇటీవల మంచి హిట్టయింది.
Be first to comment on this News / Article!
|