జగపతి ఆర్ట్స్ బ్యానర్ పై జగపతి రాజేంద్రప్రసాద్ చాలాకాలం క్రితం అక్కినేనితో తీసిన 'బంగారుబాబు' మంచి హిట్టయి బ్యానర్ ప్రతిష్టను పెంచింది. ఆసక్తికరంగా జగపతి రాజేంద్రప్రసాద్ తనయుడు జగపతిబాబు సైతం తాజాగా 'బంగారుబాబు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణం కొద్దికాలం క్రితమే పూర్తయినప్పటికీ రిలీజ్ తేదీలు మార్చుకుంటూ వాయిదాల పర్వంలో మీనమేషాలు లెక్కపెడుతోంది. జగపతిబాబు, మీరాజాస్మిన్ జటంగా శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడే ఓ రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ తేదీ ఊసే లేకపోవడం పలువురుని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఫిబ్రవరి 20న 'బంగారుబాబు' చిత్రం తేదీని నిర్మాతలు తొలుత ప్రకటించారు. కారణాంతరాల వల్ల ఆ తేదీని మరో వారం పాటు వాయిదా వేశారు. అయితే ఫ్రిబ్రవరిలో సైతం ఈ చిత్రం విడుదుదలకు నోచుకోలేదు. మార్చి మొదలైనప్పటికీ సినిమా జాడ లేకుండా పోయింది. దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో సిరి మీడియా నిర్మించిన 'మేస్త్రి' రిలీజ్ కు ముస్తాబవడంతో 'బంగారుబాబు' రిలీజ్ ను వాయిదా వేయాలని ఆ చిత్ర నిర్మాతకు దాసరి సూచించినట్టు చెబుతున్నారు. ఇదే తరుణంలో 'మేస్త్రి' రిలీజ్ తేదీలోనూ మార్పు చోటుచేసుకుంది. ఈనెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రచారం చేసుకున్నప్పటికీ 11వ తేదీని తాజాగా ప్రకటించారు. 400 ప్రింట్లతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిరిమీడియా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 'బంగారు బాబు' మరింత వెనక్కి వెళ్లక తప్పనిసరి పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఏతావాతా ఏప్రిల్ లో గానీ 'బంగారుబాబు'కు మోక్షం కలక్కపోవచ్చు. అసలే హిట్లు లేని దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు సైతం ఈ చిత్రంపైనే ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు కూడా.