అటకెక్కిన 'వరుడు'?
ఇదిగో 'వరుడు', అదిగో 'వరుడు' అంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు తప్పిస్తే ప్రిన్స్ మహేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఏడాదికి పైగా ఎక్స్ ర్ సైజ్ జరుగుతున్న ఈ చిత్రం ఇంతవరకూ సెట్స్ పైకి రానేలేదు. ఇక రాకపోవచ్చన్నదే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాటెస్ట్ టాపిక్ గా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మూలన పడిందని నిర్దారించుకున్న యూనిట్ మేనేజర్లు, డ్రైవర్లు వెనుదిరుగుతున్నారంటూ ఓ బలమైన వదంతి ఫిల్మ్ నగర్ లో గత ఒకటి రెండు రోజులుగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంతవరకూ ఒక సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో మహేష్ అసంతృప్తితో ఉండటమే ఈ తాజా పరిణామానికి ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు.
'అతడు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మళ్లీ మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ కలిసి పనిచేస్తున్నారనే వార్త మొదట్నించీ భారీ అంచనాలను రేకెత్తిస్తూ వచ్చింది. 'అతిథి' సినిమా అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో మహేష్ బాబు కొద్ది గ్యాప్ తీసుకుని మళ్లీ 'పోకిరి' వంటి సంచలన హిట్ కోసం త్రివిక్రమ్ తో టైయప్ అయ్యారు. దీంతో గత ఏడాది మహేష్ నటించిన ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇది మహేష్ అభిమానులను నిరాశపరచినప్పటికీ 'వరుడు' చిత్రం సెట్స్ పేకి వచ్చి ఎప్పుడెప్పుడు కొత్త విశేషాలు విందామా అనే ఉత్సుకత కొనసాగుతూ వచ్చింది. పక్కా స్క్రిప్టు, రాజస్థాన్ లో లొకేషన్ల ఎంపికకు కొంత వ్యవధి పడితే, స్టంట్ మాస్టర్ విజయన్ డేట్లు అందుబాటులో లేకపోవడంతో సినిమా సెట్స్ పైకి రావడంలో జాప్యం తలెత్తిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఏ దశలోనూ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని దర్శకనిర్మాతలు గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. ఈ దశలో మహేష్ కు జోడిగా తొలుత ఎంపికైన పార్వతి మిల్టన్ కు ఉద్వాసన చెప్పడం ఓ కీలక పరిణామమైంది. 'జల్సా' చిత్రం సమయంలోనే పార్వతికి త్రివిక్రమ్ ఇచ్చిన హామీ మేరకే ఆమెను 'వరుడు' చిత్రంలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా అవకాశం ఇప్పించారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో పార్వతిని తప్పించి ఆ ప్లేస్ లో అనుష్క ను ఎంపిక చేశారు. ఈ సినిమాను నమ్ముకుని ఏడాదిగా తన కెరీర్ ను పట్టించుకోలేదనీ పార్వతి వాపోయిందట. కొందరైతే పార్వతికి ఉద్వాసన పలకడం వల్ల త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ పై అంతగా శ్రద్ధ పెట్టే అవకాశాలు లేవంటూ ఊహాగానాలు చేస్తూ వచ్చారు. ఓవరాల్ ఎపిసోడ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్వహణా లోపాలు మహేష్ ను అసంతృప్తిని కలిగించాయనీ, ఫలితంగానే ఈ ప్రాజెక్ట్ మూలన పడిందనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కేవలం వదంతేనా, ముందుగా అనుకున్నట్టుగా ఈ నెలలోనే 'వరుడు' సెట్స్ పైకి వచ్చి శరవేగంగా నిర్మాణం జరుపుకొంటాడా అనేది ప్రస్తుతం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
Be first to comment on this News / Article!
|