హీరోగా లగడపాటి శ్రీధర్!
తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు, ప్రచారం తెచ్చుకున్న యువ నిర్మాతల్లో లగడపాటి శ్రీధర్ ఒకరు. లార్ స్కో పతాకంపై 'ఎవడిగోల వాడిది', 'స్టైల్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఉదయ్ కిరణ్ హీరోగా 'వియ్యాల వారి కయ్యాలు' చిత్రం సరైన సక్సెస్ సాధించకపోవడంతో కొద్ది గ్యాప్ తీసుకుని ప్రస్తుతం 'స్నేహగీతం' అనే యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 'మధుర' శ్రీధర్ ను దర్శకుడిగా కూడా పరిచయం చేస్తున్నారు. కేవలం అభిరుచి గల నిర్మాతగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా, హ్యాండ్ సమ్ జెంటిలమన్ గా కూడా ఆయనకు పేరుంది. హీరోకి కావలసిన అందం ఆయనకు ఉందని ఆయన సన్నిహితులు తరచు చెబుతుంటారు. సరిగ్గా ఇప్పుడు అదే ఆలోచన ఆయనకు వచ్చిందనీ, త్వరలోనే హీరోగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారనీ సమాచారం.
తమిళంలో విజయవంతమైన 'రామన్ తేడియ సీతై' చిత్రం హక్కులను ఆయన సొంతం చేసుకున్నారనీ, దీనిని తెలుగులో రీమేక్ చేయడంతో పాటు ఒక హీరోగా కూడా నటించబోతున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళంలో 'నా ఆటోగ్రాఫ్ ' వంటి హిట్ చిత్రాన్ని అందించిన చేరన్ దర్శకత్వంలో 'రామన్ తేడియ సీతై' రూపొందింది. చేరన్ ఇందులో ఓ పాత్ర కూడా పోషించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఇదే చిత్రం రీమేక్ ద్వారా లగడపాటి హీరో కాబోతున్నారనే వార్త ఆయన శ్రేయాభిలాషులను సంబరంలో ముంచెత్తుతోంది. ఎప్పటికప్పుడు క్రయేటివ్ ఐడియాస్ తో ముందుకు వెళ్లే లగడపాటి హీరోగా నటిస్తే ఆయనలోని నటుడు కూడా వెలుగుచూసే అవకాశాలున్నాయని వారంటున్నారు. మరి లగడపాటి ఏమంటారో?!
Read 1 Comment(s) posted so far on this News / Article!
|