ఎన్నికల సినిమాలు రెడీ
ఒకవైపు పరీక్షలు, మరోవైపు ఎన్నికల సీజన్...వెరసి సినీ కలెక్షన్లకు గండి కొడతాయని పలువురు నిర్మాతలు తమ సినిమాల విడుదలకు అనువైన తేదీలు వెతుక్కుంటున్నారు. మరికొందరు ఇంత మంచి తరుణం మళ్లీ దొరకదంటూ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్డ్ గా చిత్ర నిర్మాణం సాగించిన కొందరు ఆయా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఎన్నికల సీజన్ ను ఎంచుకోవడం సహజంగానే సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏప్రిల్ 16, 23 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నట్టు ప్రకటించడంతో ఆ షెడ్యూల్ కు ముందుగానే పలు సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. వీటిలో 'మేస్త్రి', 'అధినేత', 'నేనే ముఖ్యమంత్రినైతే' వంటి చిత్రాలున్నాయి.
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు టైటిల్ పాత్ర పోషిస్తున్న 'మేస్త్రి' చిత్రం ఈనెల 11న విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు ఐదేళ్లుగా నటనకు దూరంగా ఉన్న దాసరి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఇది రాజకీయ వ్యంగ్య చిత్రమని కాదనీ, సమకాలీన రాజకీయ స్థితిగతలు మాత్రం ఉంటాయని దాసరి చెబుతున్నారు. దాసరి పద్మ సమర్పణలో సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక జగపతిబాబు కథనాయకుడుగా రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న 'అధినేత' చిత్రం తొలి విడుదల ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు ఏప్రిల్ 10న విడుదల కానుంది. పరుచూరి బ్రదర్స్ రాసిన కథతో వి.సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నేటి సమాజ స్థితిగతులు, రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న మరో చిత్రం 'నేనే ముఖ్యమంత్రినైతే'. నరేంద్రనాయుడు, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నరేంద్రనాయుడు స్వీయ దర్శకత్వంలో నిరిస్తున్నారు. ఉగాది కానుకగా ఈనెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికి ఈ 3 చిత్రాలు విడుదల తేదీలను ప్రకటించగా, పోసాని 'రాజావారి చేపల చెరువు', వీరశంకర్ 'యువరాజ్యం' చిత్రాలు కూడా ఎన్నికల సీజన్ టార్గెట్ గా శరవేగంగా నిర్మాణం జరుపుకొంటూ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|