కోటి క్లబ్ లో కంగనా
బాలీవుడ్ తర్వాత కొత్తా పాత హీరోయిన్లను ఎక్కువగా ఆకర్షించే పరిశ్రమ మనదే. ఎందుకలా? అనడిగే వాళ్లను చూసి నవ్వుకోవాల్సిందే. హిందీలో పెద్దగా గుర్తింపు లేనివాళ్లకు కూడా ఇక్కడకు వచ్చేసరికి కాస్టీ డిమాండ్లతో, వీలుంటే స్టార్ హీరోలతో నటించాలనుకుంటున్నట్టు చెప్పే గడసరి మాటలతో అమాతం తమ డిమాండ్ ను పెంచేస్తుంటారు. అసలు కంటే కొసరు ఎక్కువన్నట్టు పలువురు నిర్మాతలు కూడా వాళ్లడిగిన రెమ్యునరేషన్ ఇచ్చుకోడానికి వెనుకాడరు. ఇప్పుడు మరో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ను దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ ఎకాఎకిన టాలీవుడ్ కు తరలించుకు వచ్చారు. ప్రభాస్ కథానాయకుడుగా ఆదిత్య రామ్ నిర్మించనున్న తాజా చిత్రానికి పూరీ సమర్పకుడు కూడా. ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ ను ప్రభాస్ కు జోడిగా ఎంపిక చేశారు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఊపిరి బిగపట్టి వినాల్సిందే. అక్షరాలా కోటి రూపాయలట. సహజంగా సెలబ్రెటీ డెబటంట్స్ కు 5 నుంచి 10 లక్షల వరకూ ఆఫర్ చేస్తుంటారు. అయితే టాలీవుడ్ లో తొలి అడుగు పడీ పడగానే కోటి రూపాయల ఆఫర్ దక్కించుకున్న తొలి హీరోయిన్ కంగనానే.
'ఆమె టాప్ హిందీ హీరోయిన్ కాదు. కనీసం టాప్ స్టార్స్ తో నటించనూ లేదు' అంటూ ఓ ప్రముఖ దర్శకుడు కంగనా పారితోషికం ముచ్చటపై స్పందించారు. ఇలియానాకు ఆమధ్య నిర్మాత బెల్లంకొండ సురేష్ తన చిత్రం కోసం కోటి రూపాయలు ఆఫర్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తమిళ 'బిల్లా' తర్వాత నయనతార కోటికి పైగా తన రేటును ఫిక్స్ చేసింది. హిందీలో గణనీయంగా సినిమాలు చేసిన దాఖలాలు లేని కంగనాకు తెలుగులో ఆరంభంలోనే కోటి ఆఫర్ ఇవ్వడం రెగ్యులర్ నిర్మాతలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోందట. భారీ బడ్జెట్ అంచనాలతో హిందీలో అనుకున్న పలు సినిమాలు ఆర్థిక మాంద్యం దెబ్బకు కుదేలవుతూ, ఆర్టిస్టులు పారితోషికం తగ్గించుకుంటూ పోతున్న తరుణంలో టాలీవుడ్ లో రివర్స్ ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోందని సదరు నిర్మాతలు వాపోతున్నారు.
Be first to comment on this News / Article!
|