'అరుంధతి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్ర కథానాయిక అనుష్క పేరు కొద్దిరోజులుగా మారుమోగిపోతోంది. ఆ చిత్రం సాధించిన సక్సెస్ తో ఆమె తదుపరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'బిల్లా' చిత్రంపై సైతం అంచనాలు ఎక్కువయ్యాయి. వీటికితోడు మహేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రంలోనూ కథానాయికగా పార్వతి మిల్టన్ ప్లేస్ లో అనుష్క ఎంపిక కావడం ఆమెకు అనూహ్యంగా పెరిగిన డిమాండ్ కు అద్దంపడుతుంది. ఇప్పుడు మరో సంచనల వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది సినిమాలకు సంబంధించిన వ్యవహారం కాదు. ఎన్నికల ప్రచారానికి చెందిన అంశం.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీలు ప్రధానంగా గ్లామర్ స్టార్స్ పై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అనుష్క ప్రచార బరిలోకి దిగబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటికే గ్లామర్ బ్యూటీ త్రిషను కాంగ్రెస్ పార్టీ ప్రచార బరిలోకి దింపుతున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. 20 రోజుల ప్రచార కార్యక్రమానికి 2 కోట్లు ఆఫర్ ఇవ్వడం ద్వారా త్రిషను ఒప్పించగలిగినట్టు తెలుస్తోంది. త్రిషతో పాటు ఇప్పుడు అనుష్కను బరిలోకి దింపడం ద్వారా పార్టీ తిరుగులేని 'గ్లామర్'ను సంతరించుకుంటుందని పార్టీ వర్గాల ఆలోచనగా తెలుస్తోంది. హీరో నాగార్జున అనుష్కతో తనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకున్ని ఆమెకు ప్రచార బరిలోకి దిగాలని సూచించి ఒప్పించినట్టు కూడా వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటనకు మరికొంత వ్యవధి పట్టవచ్చని అంటున్నారు.