'చిరు'పై దాసరి సెటైర్?
ఎన్నికల వేడి రోజురోజుగా పెరుగుతున్న తరుణంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు పొలిటికల్ నేపథ్యంలో రూపొందించిన సినిమాలతో బాక్సాఫీస్ ను కొల్లగొట్టేందుకు సమాయత్తమవుతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సైతం సమకాలీన రాజకీయాలపై 'మేస్త్రి' చిత్రాన్ని ఎక్కుపెట్టడానికి సిద్ధం చేశారు. దర్శకుడిగా 150 సినిమాలకు దగ్గరవుతూ, ఇంతకు రెట్టింపు కథలు అందించిన క్రెడిట్ కూడా దాసరికి ఉంది. ఇటీవల కాలంలో ఆయన అందించిన కథలతో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ ను ఆకట్టుకోకున్నా ఈసారి మాత్రం తన కలం బలంతో పాటు టైటిల్ పాత్ర కూడా పోషించడం, ఎన్నికల తరుణంలో తన సినిమాను బరిలోకి దింపడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దాసరి ఎలాంటి సైటర్లు విసురుతారో, ఎవరిని టార్గెట్ చేసుకుని ఉంటారోననే చర్చ రోజురోజుకూ వేడెక్కుతోంది. ఇది సెటైర్ సినిమా కాదనీ, సమకాలీన పరిస్థితులకు మాత్రం అద్దంపడుతుందనీ దాసరి వివరణ ఇచ్చినప్పటికీ ఇంతకుమించి ఏదో ఉండబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిరంజీవి, ఆయన క్యారెక్టర్ పై అల్లిన సన్నివేశాల నిడివి సుమారు 20 నిమిషాలు ఉండచ్చని కూడా చెబుతున్నారు.
చిరంజీవి, దాసరి ఒకే ప్రాంతం, సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ వారిమధ్య బయటకు కనిపించే సయోధ్య లేదనే వాదన ఒకటి ఉంది. దీనికితోడు మోహన్ బాబు సైతం 'మేస్త్రి'లో మేజర్ గా ఓ కీలక పాత్ర పోషించడంతో ఆయన పాత్రకూ కొన్ని పదునైన సంభాషణలు జోడించారనీ కూడా చెబుతున్నారు. నిజంగానే దాసరి ఇందులో పరోక్షంగానైనా చిరంజీవిపై సెటైర్లు విసిరారా అనేది ఈనెల 12న కానీ తెలియదు. ఆసక్తికరంగా దాసరి ఈ తరహా చిత్రాలను ఎన్నికల వేళ్ల అస్త్రాలుగా ఎక్కుపెట్టిన సందర్భాలున్నాయి. అలా వచ్చిన 'ఎమ్మెల్యే ఏడుకొండలు' బాక్సాఫీస్ ను ఆకట్టుకోగా, 'పిచ్చోడి చేతిలో రాయి' గురితప్పింది. 'మేస్త్రి'తో దాసరి సంచలనమే సృష్టిస్తారో, జనాల్ని థియేటర్లకు రప్పించే సత్తా తగ్గిపోయిందని అనిపించుకుంటారో చూడాలి.
Read 4 Comment(s) posted so far on this News / Article!
|