నాగచైతన్యపై ఛార్మి మనసు
అక్కినేని ఫ్యామిలీ మూడోతరం వారసుడైన నాగచైతన్య స్క్రీన్ పై ఎలా ఉండబోతున్నారు? ఇవాల్టి యువహీరోల రేస్ లో తన ప్రత్యేకతను ఏవిధంగా నిలుపుకోనున్నారనేది ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. సమ్మర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని ఈ చిత్రాన్ని ప్రచారార్భాటాలకు దూరంగా శరవేగంగా నిర్మాణం జరుపుతున్నారు. వరుస సక్సెస్ లతో తనకు తిరుగులేదనిపించుకుంటున్న నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాసువర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అలనాటి ప్రముఖ హీరోయిన్ రాధ కుమార్తె కార్తిక హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఆసక్తికరంగా మరో కీలక పాత్రలో ఛార్మింగ్ అందాల ఛార్మి నటిస్తోందంటూ ఫిల్మ్ నగర్ లో తాజా ప్రచారం జరుగుతోంది.
ఛార్మి ఇందులో ఓ టీవీ సీరియల్ కథానాయికగా కనిపిస్తుందనీ, పాత్రపరంగా నాగచైతన్యను ప్రేమించమంటూ, కనీసం డేటింగ్ అయినా చేయమని అల్లరి చేసే పాత్రలో నటిస్తోందనీ ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరంగా మరో గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇందులో నాగార్జున, రాధ కూడా గెస్ట్ పాత్రల్లో కనిపించనున్నారనేది ఈ గాసిప్ సారాంశం. ఇదే నిజమైతే తండ్రీ కొడుకులు, తల్లీకూతుళ్లు ఒకే సినిమాలో కనిపించడం ఆడియెన్స్ ను సంబరపరచే విషయమే. ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం ఉండబోతోందనీ, ఆగ్రాలో చిత్రీకరించే కీలక సన్నివేశాలు కథకు కీలకమనీ చెబుతున్నారు. దిల్ రాజు తన గత చిత్రాల తరహాలోనే వైజాగ్ లోనూ కొంత భాగం షూటింగ్ జరుపనున్నారు. నాగార్జున ఫేవరెట్ సందీప్ చౌతా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 'జోష్ ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Be first to comment on this News / Article!
|