నిన్న త్రిష...నేడు భూమిక
ఇదేదో టాలీవుడ్ అగ్రాసనం కోసం జరుగుతున్న పోటీ కాదు. నెంబర్ల రేసూ కాదు. ఎటొచ్చీ సదరు తారామణుల ప్రమేయం లేకుండానే వారికి పొలిటికల్ కలర్ అంటుకుంటోంది. ఇటీవల ఎన్నికల షెడ్యూల్ ను ఇ.సి. ప్రకటించడంతో దేశమంతటా ఇప్పుడు ఎన్నికల వేడి ఊపందుకుంది. టిక్కెట్లు రాని నాయకులు పార్టీల ఫిరాయింపుల పర్వంలోనూ, టిక్కెట్లు వస్తాయని భరోసా ఉన్న ముమ్మర ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజకీయాలకూ, సినిమా రంగానికి విడదీయరాని బంధం ముందు నుంచీ ఉన్నదే. ఏ తారలు ఏ పార్టీ తరఫున ప్రచారాన్ని చేపడతారనే ఉత్సుకత రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు తెలుగునాట ఎప్పుడూ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంది. 'తెలుగు దేశం' (మహాకూటమి) తరఫున నందమూరి ఫ్యామిలీ హీరోలు, ' ప్రజారాజ్యం' తరఫున చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 'గ్లామర్' తారలను ప్రచార రంగంలోకి దింపనుందనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న త్రిష కాంగ్రెస్ ప్రచార బరిలోకి దిగుతోందనీ, 20 రోజుల ప్రచార కాల్షీట్లకు 2 కోట్లు ఆఫర్ చేశారనీ ఊహాగానాలు వినిపించాయి. షరామామూలుగానే...ఇవి వదంతులేననీ, ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికే తనకు సమయం చాలడం లేదనీ త్రిష తేల్చిచెప్పింది. ఇప్పుడు మరో అందాల నటి భూమిక వంతు వచ్చింది. ఆమె తెలుగు దేశం పార్టీలో చేరనుందంటూ రెండు మూడ్రోజులుగా వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
భూమికను ఇదే విషయమై సంప్రదించినప్పుడు ఆమె ఈ వార్తలను నిరాధారమంటూ కొట్టేసింది. 'సమాజ సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను. అందుకోసం ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదు. సమాజ సేవా కార్యక్రమాల్లో భాగంగానే తెలుగు దేసం పార్టీకి చెందిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్నాను. అంతకుమించి రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు' అని భూమిక తేల్చిచెప్పింది. ఏతావాతా నిన్న త్రిష 'చేయి' జారిపోతే, నేడు భూమిక సైకిల్ ఎక్కనంటూ మొరాయించిందన్నమాట.
Be first to comment on this News / Article!
|