శింబు 'మావాడు' 20న
'వల్లభ', 'మన్మథ' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శింబు ఇప్పుడు 'మావాడు'గా రాబోతున్నాడు. తమిళ 'శిలాంబొట్టం'చిత్రానికి ఇది రీమేక్. లక్ష్మీమూవీ మేకర్స్ ఇండియా లిమిటెడ్ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించగా, ఆర్యన్ మీడియా సంస్థ ఆంధ్రదేశమంతటా విడుదల చేస్తోంది. ప్రముఖ చాయాగ్రాహకుడు ఎస్.శరవణన్ దర్శకుడు. స్నేహ, సనాఖాన్ కథానాయికలుగా నటించారు.
ఈ చిత్రంలోని పాటలను హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రదర్శించారు.
ఆర్యన్ మీడియాకు చెందిన వాసు మాట్లాడుతూ, తమిళంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందనీ, ఈనెల 20న ఈ చిత్రాన్ని తెలుగునాట విడుదల చేస్తున్నామనీ చెప్పారు. అతిథిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, లక్ష్మీమూవీ మేకర్స్ సంస్థ తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ అనీ, శింబు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారనీ చెప్పారు. ఇదొక కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ అని దర్శకుడు శరవణన్ తెలిపారు. తెలుగులో నాగార్జున నటించిన 'ఆటోడ్రైవర్' చిత్రంతో పాటు పలు తెలుగు, తమిళ చిత్రాలకు తాను ఛాయాగ్రహణం అందించాననీ, దర్శకుడిగా తనకు ఇది తొలి చిత్రమనీ అన్నారు. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన శింబు దానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? జనం చేత మళ్లీ మావాడు అని ఎలా అనిపించుకున్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని తెలిపారు. కథ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్ తో తీశామనీ, చెన్నై, హైద్రాబాద్ తో పాటు విదేశాల్లోనూ ఈ చిత్రం షూటింగ్ జరిపామనీ చెప్పారు. అలాగే సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాకు ఇది శింబుతో మూడో చిత్రమని తెలిపారు. శింబు సోదరుడుగా సీనియర్ నటుడు ప్రభు నటించారనీ, స్నేహ అభినయం, సనాఖాన్ గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ చిత్రాన్ని కె.మురళీధరన్, వి.స్వామినాథన్, టి.ఎస్.రంగరాజన్ కలిసి నిర్మించారు.
Be first to comment on this News / Article!
|