ఆర్య వెర్సస్ ఆర్య
అల్లు అర్జున్ కు కెరీర్ ప్రారంభంలో లభించిన పెద్ద హిట్ 'ఆర్య'. ఆ చిత్రంపై ఆయనకు ప్రత్యేక మమకారం కూడా ఉంది. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు ఆర్య-2 (సీక్వెల్)లో నటిస్తున్నారు. సమ్మర్ రేసులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సంగతి అటుంచితే....మన 'ఆర్య' ఇప్పుడు తమిళ 'ఆర్య'ను ఢీకొనబోతున్నాడు. ఇందులో గందగరగోళం ఏమీ లేదు. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంగా గుణశేఖర్ దర్శకత్వంలో నటించబోతున్నారు. యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు గుణశేఖర్ తాజాగా అల్లు అర్జున్ ను వెండితెరపై ఢీకొనే ప్రతినాయకుడి కోసం అన్వేషించి ఆ పాత్రకు తమిళ నటుడు ఆర్యను ఎంపిక చేసినట్టు భోగట్టా.
తమిళంలో బాల దర్శకత్వంలో వచ్చిన 'నాన్ కడవుల్ ' చిత్రం ఇటీవల తెలుగులోనూ 'నేను దేవుడు' పేరుతో అనువాద చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కమర్షియల్ సక్సె స్ కు నోచుకోనున్నా నటుడు ఆర్యకు అరుదైన ప్రశంసలు లభించాయి. దీంతో ఆయన పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిలోనూ పడ్డారు. గుణశేఖర్ ఓ అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను ఆర్యకు ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వచూపారట. ప్రతినాయకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరో పాత్ర అంతకంటే ఎక్కువ ఎలివేట్ అవుతుందని గుణశేఖర్ భావించి విలన్ పాత్రకు ఆర్యను ఒప్పించారని చెబుతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా కొత్తమ్మాయి భానుశ్రీ తెలుగుతెరకు పరిచయమవుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన రెండు భారీ సెట్స్ లో ఈనెల 21 నుంచి తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే పట్టుదలతో నిర్మాత దానయ్య ఉన్నారు. ఈ చిత్రానికి 'గజనీ' ఫేమ్ ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|