కింద పడిన వాడే పైకి లేవగలడని అంటారు. అయితే పడిన వాళ్లందరూ లేవలేకపోవచ్చు. పడినా లేవగలగడం దర్శకుడు పూరీ జగన్నాథ్ కు మాత్రం 'టైటిల్స్'తో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా పూరీ జగన్నాథ్ గేమ్ ప్లాన్ గురించే. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూరీ జగన్నాథ్ ఏకఛత్రాధిపత్యానికి ఈమధ్యన 'నేనింతే'తో ఓ చిన్న బొప్పి కట్టింది. పరిశ్రమలోని గుట్టుమట్లు విప్పుతానంటూ కథని ముందుకు సాగనివ్వకపోవడం, పరనిందకే ఎక్కువ సమయం కేటాయించడంతో నేనింతే...ఇక ఇంతే అంటూ సెలవు తీసుకుంది. సినిమా హిట్టయితే తన తమ్ముడు సాయిరాం శంకర్ తో ఓ సినిమా తీయాలనుకున్న పూరీ ప్రస్తుతం తన గేమ్ ప్లాన్ మార్చుకుని తమ్ముడితో ప్రయోగం చేయడం కంటే తన 'డార్లింగ్ ' ప్రభాస్ తోనే కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'బుజ్జిగాడు' ప్రభాస్ ను కొత్తకోణంలో చూపించింది. రెండోసారి ఈ కాంబినేషన్ లో తీయబోయే చిత్రానికి పూరీ అప్పుడే కథతో పాటు టైటిల్ కూడా సిద్ధం చేసేశారు. దీనికి 'ఏక్ నిరంజన్' అనే టైటిల్ ను పూరీ నిశ్చయించారట.
టైటిల్ ను బట్టి ప్రస్తుతానికి ప్రభాస్ పాత్రను ఎవరికి వాళ్లే ఊహించుకోవచ్చు. ఒంటిరి జీవితమే హాయని అనుకునే వాళ్లని 'ఏక్ నిరంజన్' అని పిలుస్తుంటారు. హీమ్యాన్ లా కనిపించే ప్రభాస్ ను ఏక్ నిరంజన్ గా హీరోయిన్లు ఉండనిస్తారా? అందుకేనేమో సెక్సీ కంగనా రనౌత్ ను బాలీవుడ్ నుంచి పూరీ పార్శిల్ చేసి మరీ ఈ సినిమా కోసం తీసుకువచ్చారు. మరో ముద్దుగుమ్మ ఎంపిక కూడా జరుగుతోంది. ఇద్దరు హీరోయిన్లతో 'ఏక్ నిరంజన్' పడే పాట్లు ఇందులో హిలేరియస్ గా పూరీ చూపించొచ్చు. ఆదిత్య రామ్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ సమర్పణలో 'ఏక్ నిరంజన్ ' అతి త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది.