'చేపల చెరువు'కు గండి?
ఎన్నికల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని పొలిటికల్ నేపథ్యంలో దాసరి నారాయణరావు రూపొందించిన 'మేస్త్రి' ఇప్పటికే రిలీజ్ కావడం, ఇది 'ముఠామేస్త్రి'పై దాసరి ఎక్కుపెట్టిన అస్త్రంగా ముద్ర పడటంతో ఇప్పుడంతా పోసాని దర్శకత్వంలో శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్న 'రాజావారి చేపల చెరువు' చిత్రం పైనే ఉంది. పోసాని 'ప్రజారాజ్యం' పార్టీలో చేరడం, ఆయనకు ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్టు ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కుపెట్టే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఎవరి మీద ఉండబోతున్నాయనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతూ వస్తోంది. అందులోనూ 'ఆపద మొక్కులవాడు' సినిమా సకాలంలో విడుదల కాకపోవడానికి దాసరే కారణమంటూ పోసాని అప్పట్లో విరుచుకుపడిన నేపథ్యంలో 'రాజావారి చేపల చెరువు' మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. దాసరికి ఈసారి పోసాని కౌంటర్ ఇవ్వబోతున్నారనీ, ఆయన చేపల చెరువులో దాసరి ఓ చేప కాబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఇందులో పోసాని ముఖ్యమంత్రి గెటప్ లో కనిపించనుండటం కాంగ్రెస్ పార్టీలోనూ అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి వై.ఎస్.ను దృష్టిలో పెట్టుకునే ఈ వేషం కట్టి ఉండవచ్చనే ఆపోహలూ కాంగ్రెస్ లో మొదలయ్యాయి. దీంతో 'చేపల చెరువు'కు తాత్కాలికంగానైనా గండి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'రాజావారి చేపల చెరువు' చిత్రంపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసినట్టు తాజా సమాచారం. ఎన్నికల తొలి షెడ్యూల్ కు వారం రోజుల ముందు (ఏప్రిల్ 9న) ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే పట్టుదలతో పోసాని ఉన్నారు. అయితే పోసాని కేవలం కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఈ సినిమా తీసినట్టు కనిపిస్తోందనీ, టైటిల్ కూడా వై.ఎస్.ను దృష్టిలో పెట్టుకుని నిశ్చయించి, నేరుగా ఆయన గెటప్ కూడా వేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందనీ కాంగ్రెస్ ఎంపీ ఎం.ఎ.ఖాన్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఐ.వి.సుబ్బారావుకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తమ పార్టీకి ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు సెన్సార్ బోర్డు అనుమతిని ఆపాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆసక్తి కరంగా పోసాని 'రాజావారి చేపల చెరువు'కు నిశ్చయించిన ముహూర్తానికే జగపతిబాబు 'అధినేత' రిలీజ్ అవుతోంది. ప్రస్తుతానికైతే అధినేత రిలీజ్ కు అభ్యంతరాలు లేవు. 'చేపల చెరువు'కు మాత్రం ఏమేరకు గండి పడుతుందనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|