మహేష్ నూ బరిలోకి లాగారు!
రాను రానంటున్న ప్రిన్స్ మహేష్ నూ రాజకీయ 'రొంపి'లోకి లాగేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వయసులో మహేష్ కు సమకాలికుడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరఫున రోడ్ షో లతో ఊదరగొట్టేస్తున్నారు. మరోవైపు మహేష్ రాజకీయాలకు దూరమంటూ సూపర్ స్టార్ కృష్ణ తేల్చిచెప్పేశారు. అయితే తనలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోందనీ, ఆ పార్టీకే తన అభిమానులు, మహేష్ సేన ప్రచారం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు కూడా. ఈ తంతు ఇప్పట్లో తేలదనుకున్నారో ఏమో గానీ, ఇప్పుడు ఎకాఎకిన ఎన్టీఆర్ తో మహేష్ కు లింకు పెట్టేసి ఓ పుకారు బయటకు తెచ్చేశారు. రోడ్ షోలతో జనాల్ని సమ్మోహితులను చేస్తున్న ఎన్టీఆర్ ను మహేష్ బాబు ఫోన్ చేసి అభినందించారనేది తాజా కథనం. అక్కడితో ఆ కథనం ఆగిపోలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ ను ప్రచారం చేయవద్దని కూడా మహేష్ కోరారంటూ పుకారు పుట్టించారు.
చంద్రగిరి నియోజకవర్గం నుంచి హీరో కృష్ణ వియ్యపురాలు గల్లా అరుణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరఫున రోజా బరిలో ఉన్నారు. ఎన్టీఆర్ అక్కడ ప్రచారం చేయకుంటే గల్లా అరుణ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని మహేష్ ఆలోచన కావచ్చనేది ఆ వదంతి సారాంశం. ఇక్కడ ఆలోచించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రచారం చేస్తే గల్లా అరుణ ఓడిపోతుందనుకుంటే మహేష్ స్వయంగా ప్రచారంలోకి దిగొచ్చు కదా? ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముటుంది? ఏతావాతా...పుకార్లు పుట్టించిన వారి ఉద్దేశాలు వేరే ఉండొచ్చని అనుకోవడానికీ ఆస్కారం ఉంది. ఎన్టీఆర్ ప్రచార ప్రభంజనానికి తిరుగులేదనీ, బాబు సారధ్యంలోని 'మహా' కూటమి క్లీన్ స్వీప్ అవుతుందనీ చెప్పడం వారి ఉద్దేశం కావచ్చు. అలాకాకుంటే...మహేష్ కాంగ్రెస్ పక్షానే ఉంటారని చెప్పకనే చెప్పే ఉద్దేశమూ ఉండొచ్చు. మునుముందు ఇంకెన్ని సిత్రాలు చూడాలో మరి...
Be first to comment on this News / Article!
|