గిల్లీ అలియాస్ గీతాంజలి (ఛార్మి) ఓ క్యూట్ గాళ్. పెళ్లి ఆలోచనకు దూరం. జీవించిన ప్రతి క్షణాన్ని అర్ధవంతంగా మలుచుకోవాలనే మనస్థత్వం ఆమెది. తన బ్యాగేజీతో హైద్రాబాద్ లోకి అడుగుపెట్టి కోఠిలోని తన ఫ్రెండ్ రూమ్ లో బస చేస్తుంది. ఆమె గదికి ఎదురుగా ఉన్న హోటల్ పేరే మనోరమ. అక్కడ ఛాట్ చాలా ఫేమస్. ఎప్పుడూ జనంతో రద్దీగానే ఉంటుంది. గిల్లీకి ఓ ప్రత్యేకత ఉంది. దూరంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్లు మాట్లేడే విషయాలను లిప్ రీడింగ్ ద్వారా చెప్పేయగలదు. కాలక్షేపం కోసం అప్పుడప్పుడు కిటికీ దగ్గరకు వచ్చి బైనాక్యులర్ తో జనాలను అబ్జర్వ్ చేస్తుంటుంది. ఆ అలవాటే ఒకరోజు కీలకమైన మలుపునకు దారితీస్తుంది.
నగరంలో ఐఎస్ఎ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నుతున్నట్టు పోలీసు కమిషనర్ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. అప్పుడే ఓ ఐఎస్ఐ ఏజెంట్ కిల్లర్ (నిషాన్ ) చేతిలో బ్యాగ్ తో కోఠి సెంటర్ లోకి అడుగుపెడతాడు. అతని టార్గెట్ మనోరమ హోటల్ లో శక్తివంతమైన బాంబు పేల్చడమే. మనోరమ బైనాక్యులర్ తో బయటకు చూస్తున్నప్పుడు తనకు తెలిసిన లిప్ రీడింగ్ ద్వారా వాసు అనే వ్యక్తి పబ్లిక్ టెలిఫోన్ బూత్ లో మాట్లాడుతున్న విషయాన్ని గ్రహిస్తుంది. తన ప్రేమ గెలవక పోతే అదే రోజు సాయంత్రం ఆత్మహత్య చేసుకుంటానని వాసు ఫోనులో తన ప్రియురాలు లక్ష్మితో చెబుతాడు. వాసు డయిల్ చేసిన ఫోన్ నెంబర్ ను దూరం నుంచే చూసిన గిల్లీ ఆ వెంటనే లక్ష్మికి ఫోనే చేసి వాళ్లది నిజమైన ప్రేమేనని తెలుసుకుంటుంది. వాసు ప్రాణానికి తన అన్నల ద్వారా ప్రమాదం ఉందనే విషయాన్ని అతనికి చెప్పమంటూ లక్ష్మి కోరడంతో వాసు ఆచూకీ కోసం గిల్లీ ప్రయత్నిస్తుంటుంది. అంతకుముందే బైనాక్యులర్ ద్వారా తన దృష్టిలో పడిన కిల్లర్ ను గిల్లీ యాదృచ్చికంగా కలుసుకుటుంది. అయితే అతను అప్పటికే హోటల్ లో బాంబు ఫిక్స్ చేస్తాడు. వాసు తనకు ఏమీ కాకపోయినా అతని ప్రాణాలను కాపాడాలనుకుంటున్నట్టు కిల్లర్ తో ఆమె చెబుతుంది. వాసును వెదకడం కోసం అతని సహాయం కోరుతుంది. ఆ స్వల్ప పరిచయంలోనే గిల్లీ పట్ల అతనిలో అభిమానం కలుగుతుంది. అది ప్రేమగా మారుతుంది. అతని కుటుంబ సభ్యులంతా గోద్రా అల్లర్లలో ప్రామాలు కోల్పోయినట్టు తెలుసుకున్న గిల్లీ అతన్ని అనునయిస్తుంది. గిల్లీ కూడా చావుకు రోజురోజుకూ దగ్గరవతోందనే చేదు విషయాన్నికూడా కిల్లర్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగింది? బాంబు బ్లాస్ట్ జరిగిందా? కిల్లర్ తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనేది మిగతా కథ.