రవితేజ 'ఫ్యాషన్ డిజైనర్'
ఇటు వినోదం, అటు యాక్షన్ రెండూ సమాంతరంగా పండించగల హీరోల్లో రవితేజకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మినిమం గ్యారెంటీ హీరోగా పేరుపడిన రవితేజ 'కృష్ణ' వంటి సక్సెస్ తర్వాత 'బలాదూర్', 'నేనింతే' వంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. అయితే ఈసారి పక్కా ప్లానింగ్ తో తన తదుపరి చిత్రాలను ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 'కిక్' చిత్రం సమ్మర్ హీట్ సృష్టించడానికి సిద్ధంగా ఉంది. అలాగే పరుశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న 'ఆంజనేయులు' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చింది. తాజాగా సీనియర్ డైరెక్టర్ వంశీ దరకత్వంలో ఓ హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించేందుకు రవితేజ సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల తాజా భోగట్టా.
'అన్వేషణ', 'సితార' వంటి పలు సెన్సేషన్ హిట్లు అందించిన వంశీకి అప్పట్లో రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా రూపొందించిన 'లేడీస్ టైలర్' చిత్రం ఎంత మంచి పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన ఆయనకు చాలా కాలంగా ఉంది. ఇందుకు సంబంధించి ఓ కథను తనికెళ్ల భరణి రెడీ చేసినట్టు కూడా అప్పట్లో వినిపించింది. తాజా సమాచారం ప్రకారం 'లేడీస్ టైలర్ -2' కోసం వంశీ సిద్ధమవుతున్నారు. దీనికి 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. సిటీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, హీరోగా రవితేజతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. రవితేజ-వంశీ కాంబినేషన్ లో గతంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతమైంది. రవితేజ కెరీర్ కు కూడా ఈ చిత్రం మంచి బ్రేక్ అయింది. ఈ క్రమంలో వంశీ-రవితేజ కాంబినేషన్ వర్కవుట్ అయితే సంచలనాలకు కొదవుండదు.
Be first to comment on this News / Article!
|