సింహళ భాషలో అరుంధతి
'అరుంధతి' చిత్రం ఇప్పుడు ఎల్లలు చెరిపేస్తుంది. సంక్రాంతి రేసులోనే కాకుండా, ఆ తర్వాత విడుదలైన చిత్రాలను కూడా పక్కకు నెట్టి ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లోనే సంచనల విజయాన్ని 'అరుంధతి' దక్కించుకుంది. ఈ చిత్రం తర్వాత అనుష్క అగ్రనాయక స్థానానికి ఎదిగి కోటి రూపాయల రెమ్యునరేషన్ స్థాయికి ఎదిగింది. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి రీమేక్ రైట్స్ ను ఎవరికీ ఇవ్వకుండా సొంతంగానే వివిధ భాష్లలో అనువదించి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల తమిళ 'అరుంధతి' అనువాదరూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్ట్రయిట్ తమిళ చిత్రాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోందని నిర్మాత చెబుతున్నారు. పనిలో పనిగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలోనూ శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. తొలుత శ్రీలంకలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం.
శ్రీలంకలో తమిళుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అయితే మెజారిటీ సింహళీయులు, తమిళుల మధ్య ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని 'అరుంధతి' చిత్రాన్ని సింహళ భాషలో అనువదించి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది కార్యరూపంలోకి వస్తే మన తెలుగు 'జేజమ్మ' లంకేయుల చేత కూడా జేజేలు కొట్టించుకోవడం ఖాయం.
Be first to comment on this News / Article!
|