'సూపర్' గాళ్ గా పరిచయమైన అనుష్క ఇప్పుడు 'జేజమ్మ'గా జేజేలు అందుకుంటోంది. ఏ స్టార్ ఎన్ని మెట్లు ఎదిగినా తమను ఇండస్ట్రీకి తీసుకువచ్చిన వారి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞతలు కలిగి ఉంటారు. మరి అనుష్కను పరిశ్రమకు తీసుకువచ్చిందెవరు? ఇంకెవరు...నాగార్జున తనయుడు నాగచైతన్యేనంటూ చాలా కాలంగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ముంబైలో అనుష్క యోగా ఇన్ స్ట్రక్టర్ గా ఉన్నప్పుడు నాగచైతన్య తనకు ఏర్పడిన పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను నాగార్జునకు సిఫారసు చేశారనీ, అలా 'సూపర్'లో అనుష్క ఎంట్రీ ఇచ్చిందనీ ఎప్పట్నించో అందరూ అనుకుంటున్నదే. అయితే ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్పుకోక తప్పదు. అనుష్కను సిఫారసు చేసింది నాగచైతన్య ఎంతమాత్రం కాదట.
అనుష్క వద్ద ఇటీవల ఆ ప్రస్తావన వచ్చినప్పుడు 'భరత్ ఠాగూర్ నాకు యోగా ఇన్ స్టక్టర్. ఆ తర్వాత ఆయన నటి భూమికను పెళ్లిచేసుకున్నారు. దర్శకుడు ఇ.నివాస్ కు భరత్ ఠాగూర్ మంచి మిత్రుడు. ఆ పరిచయంతోనే భరత్ నన్ను నివాస్ కు పరిచయం చేశారు. అదే సమయంలో పూరీ జగన్నాథ్ గారు ఓ సినిమా తీయాలనుకుంటున్నారు. ఇది తెలిసిన నివాస్ నన్ను పూరీ జగన్నాథ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత పూరీ సూపర్ సినిమా తీయడం..నేను ఆ చిత్రంతో పరిచయం కావడం అందరికీ తెలిసిందే' అంటూ అనుష్క నవ్వుతూ వివరణ ఇచ్చింది. ఏతావాతా అనుష్క కెరీర్ విషయంలో నాగచైతన్య ప్రమేయం ఏమీ లేనట్టుగానే అర్ధం చేసుకోవాలి.