లేడీస్ టైలర్ ఎవరు?
ఆమాత్రం తెలీదూ...రాజేంద్రప్రసాద్ అంటారు. సెంట్ పర్సంట్ కరెక్టే. వంశీ డైరెక్షన్ లో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది. రాజేంద్రప్రసాద్ కెరీర్ కు సరైన బ్రేక్ దొరికి ఆ తర్వాత నుంచి ఆయన నటుడిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ ముచ్చట ఇప్పుడు పాతబడింది. కొత్త ముచ్చటల్లా 'లేడీస్ టైలర్'కు త్వరలో సీక్వెల్ రాబోతున్న వ్యవహారమే. ఈ విషయం ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేసింది. ఈ సీక్వెల్ కు 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ ను డిసైడ్ చేసి స్టార్ కాస్ట్ ఎంపిక పనిలో వంశీ పడ్డారని ఫిల్మ్ నగర్ టాక్. టైటిల్ ను బట్టి ఈసారి లేడీస్ టైలర్ కొడుకు మీదే కథ నడుస్తుందనేది నిర్వివాదాశం. ఇందుకు తగ్గట్టుగానే కథానాయకుడుగా రవితేజ పేరు పరిశీలనలో ఉందంటూ వినిపించింది. అయితే ఇప్పుడు రవితేజ ప్లేస్ లో అల్లరి నరేష్ పేరు వినిపిస్తోంది.
రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాల హీరోగా ఆయన ప్లేస్ ను అందింపుచుకున్న హీరోగా అల్లరి నరేష్ ను చెప్పొచ్చు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా 'గమ్యం', 'సీమశాస్త్రి' 'బ్లేడ్ బాబ్జి' వంటి లేటెస్ట్ హిట్లు ఆయన తన ఖాతాలో జమచేసుకున్నారు. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ అయితే 'ఫ్యాషన్ డిజైనర్'గా దుమ్ము రేపుతాడనీ, ఆయనకు ఫ్యామస్ లేడీస్ టైలర్ ను (రాజేంద్రప్రసాద్) కూడా జోడిస్తే ఇక నవ్వుల విందుకు కొదవుండదనీ దర్శకనిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ ఇందులో రవితేజనే కన్ ఫర్మ్ చేస్తే వంశీతో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయడం ఇది రెండోసారి అవుతుంది. అల్లరి నరేష్ పరంగా చూస్తే వంశీతో పనిచేయడం ఇదే మొదటి సారి అవుతుంది. త్వరలోనే ఈ కన్ఫ్యూజన్ కు తెరపడనుంది.
Be first to comment on this News / Article!
|