ఛార్మికి 'మాంద్యం' దెబ్బ!
ఆర్థిక మాంద్యం ఎవరికీ అంతుపట్టని ఓ 'బ్రహ్మపదార్ధం'గానే కనిపిస్తోంది. కనీసం పరిశ్రమ వరకైనా ఈ పరిస్థితి ప్రస్ఫుటంగానే ఉంది. ఓవైపు నయనతార ఈమధ్యనే రవితేజ 'ఆంజనేయులు' చిత్రానికి 30 రోజుల కాల్షీట్లకు 65 లక్షలు డిమాండ్ చేసి ఓకే చేయించుకుందట.'అరుంధతి' తర్వాత అనుష్క రేటు కోటికి చేరిపోయిందట. ఇప్పటికీ ఇలియానాదే పారితోషికం పరంగా నెంబర్ వన్ ప్లేస్ లోనే ఉంది. ఇందుకు భిన్నమైన పరిస్థితిని గ్లామర్ నటి ఛార్మి చవిచూస్తోంది. చిన్న సినిమాలకు పెద్ద దిక్కు అనిపించుకుంటున్న ఛార్మి రాసి పరంగా ఎక్కువ సినిమాలే చేస్తున్నా వాసి పరంగా తన సహచర హీరోయిన్ల రేసులో క్రమంగా వెనుకబడుతుండటంతో ఆమె పారితోషికం విషయంలో నిర్మాతలు బేరసారాలకు దిగుతున్నారనీ, ఫలితంగా ఛార్మి తన రెమ్యునరేషన్ లో 'కోత'కు కూడా సిద్ధపడుతోందనీ ట్రేడ్ వర్గాల భోగట్టా.
'మంత్ర' సినిమాతో ఛార్మి డిమాండ్ అనూహ్యంగా పెరిగినప్పటికీ ఆమె అరకోటి రెమ్యునరేషన్ దాటిన సందర్భాలు లేవు. ఆ సినిమా తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె పెద్దదిక్కయింది. అయితే రొటీన్ మూసలో పడి కథాబలం లేని చిత్రాలు చేస్తూ పోతోందనే విమర్శను ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న '16 డేస్' బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసింది. ఉగాదికి విడుదలైన 'మనోరమ' చిత్రానికి బలహీనమైన ఓపినింగ్స్ వచ్చాయి. దీంతో ఛార్మితో ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్న నిర్మాతలు రెసిషన్ (ఆర్ధిక మాంద్యం) సాకు చూపించి ఆమెతో 25 లక్షలకు బేరసారాలకు తిరుగుతున్నారట. ప్రస్తుతం 40 లక్షల వరకూ తీసుకుంటున్న ఛార్మి ఇందుకు బెట్టుసరిగానే ఒప్పుకుంటోందట. నిజానికి ప్రస్తుతం ఛార్మికి గణనీయంగానే సినిమాలు ఉన్నాయి. 'మాయగాడు', 'కావ్యాస్ డైరీ' విడుదలకు సిద్ధమవుతుండగా, ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం నిర్మాణంలో ఉంది. ఇందులో ఏ ఒక్కటి హిట్టయినా ఛార్మి మళ్లీ తన డిమాండ్ ను నిలబెట్టుకోవచ్చు.
Be first to comment on this News / Article!
|