చరణ్ ఒకటి..శ్రీహరి రెండు!
'చిరుత' చిత్రం తర్వాత రామ్ చరణ్ ను 'మగధీర'గా ఎప్పుడెప్పుడు వెండితరెపై చూస్తామనే ఉత్సుకత ఇటు ప్రేక్షకులలోనూ, మెగాభిమానుల్లోనూ రోజురోజుకూ ఎక్కువవుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిస్తుండగా, ఇంతవరకూ ఫెయిల్యూర్ ఎరుగని ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండం, రామచరణ్ తో కలిసి చిరంజీవి ఒక పాటలోనూ, మరో కీలక సన్నివేశంలోనూ కనిపించ నుండటం ఈ చిత్రంపై భారీ అంచనాలకు తావిస్తోంది. దీనికితోడు రాజమౌళి ఈ చిత్రం ద్వారా తొలిసారి ప్రేమకథా ఇతివృత్తాన్ని హ్యాండిల్ చేస్తుండటం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. పునర్జన్మల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామచరణ్ కు జోడిగా కాజల్ నటిస్తుండగా, శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఆసక్తికరంగా ఇందులో శ్రీహరి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు యూనిట్ వర్గాల కథనం.
ఓవైపు సోలో హీరో పాత్రల్లో నటిస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్ల ద్వారా శ్రీహరి తనకుంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకుంటున్నారు. శ్రీహరి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తే సినిమా హిట్టనే సెంటిమెంట్ కూడా బాగా వర్కవుట్ అవుతోంది. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి చిత్రాలు
ఈ కోవలోనివే. 'మగధీర'లో శ్రీహరి పాత్ర పేరు షేర్ ఖాన్ అని తెలుస్తోంది. శ్రీహరి వల్లనే రామ్ చరణ్ - కాజల్ జంట విడిపోతుందనీ, ఆ ఇద్దరూ మరుజన్మ ఎత్తినప్పుడు అదే శ్రీహరి వాళ్లిద్దరినీ కలుపుతారనీ తెలుస్తోంది. ఈ చిత్రం తప్పనిసరిగా పెద్ద హిట్ అవుతుందని శ్రీహరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 పాటల చిత్రీకరణ మినహా దాదాపు షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ లో సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో, సమ్మర్ కానుకగా మేలో సినిమా విడుదలకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ, ఎం.రత్నం మాటలు, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనింగ్, పీటర్ హెయిన్స్ ఫైట్స్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|