కమ్ములను కాదన్న నమిత?
అనుష్క నలుపు 'బికినీ' వేసుకుంటే తానేమీ తక్కువ కాదనన్నట్టు నమిత తెలుపు 'బికినీ'తో 'బిల్లా' ప్రేక్షకులను రెప్పలు వేయకుండా చేసింది. అయితే నమిత మరీ ఓవర్ వెయిట్ గా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్ చేయడమూ జరిగింది. దర్శకుడే సంభాషణల రచయిత కావడంతో ఆమెను 'బండది' అని హీరోతో చెప్పించినప్పుడు ప్రేక్షకులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. నిజానికి హీరోయిన్ కు తక్కువ, వాంప్ కు ఎక్కువగా ఉంటే పాత్ర కాబట్టి నమిత కూడా పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. అయితే 'బిల్లా' మ్యాజిక్ తో ఎకాఎకిన శేఖర్ కమ్ముల సినిమాలో నటించే అవకాశం నమిత వరించింది. అయితే ఆ ఆఫర్ ను నమిత సున్నితంగా తోసిపుచ్చినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా.
'ఆనంద్' , 'గోదావరి', 'హ్యాపీడేస్' వంటి మంచి హిట్స్ అందించిన శేఖర్ కమ్ముల కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకపగ్గాలు చేపట్టారు. డి.రామానాయుడు మనువడు, డి.సురేష్ బాబు తనయుడు అయిన రాణాను హీరోగా పరిచయం చేస్తూ ఎవిఎం సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి 'లీడర్' అనే టైటిల్ పరిశీలనలో కూడా ఉంది. ఈ చిత్రం రాణాకు జోడిగా రుక్ష్మిణి అనే కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలోని ఓ ఐటెం సాంగ్ కోసం నమితను డి.సురేష్ బాబు సంప్రదించారనీ, ఐటెం సాంగ్ కు ఒప్పుకుంటే వెంకటేష్ తదుపరి చిత్రంలో మంచి పాత్ర ఇస్తామని కూడా ఆయన ఆఫర్ ఇచ్చారనీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే నమిత మాత్రం ఐటెం సాంగ్ కు తగ్గడం ఇష్టంలేక ఆ ఆఫర్ ను సున్నితంగా తోసిపుచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం నమిత తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉన్న 'జగన్మోహిని' చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. అందులో నమిత టైటిల్ రోల్ పోషించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో మంచి డిమాండ్ వస్తుందనీ, తొందరపడి చిన్నాచితకా పాత్రలు ఒప్పుకుంటే తెలుగులో సెకెండ్ ఇన్నింగ్స్ సైతం మసకబారుతుందనీ నమితకు సన్నిహితులు సూచిస్తున్నారట.
Be first to comment on this News / Article!
|