'ఆనందతాండవం' రివ్యూ
'అపరిచితుడు', 'దశావతారం' వంటి పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రాలను అందించిన ఆస్కార్ ఫిలింస్ బ్యానర్ నుంచి ఇటీవల వస్తున్న చిత్రాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మానవ సంబంధాలపై ఇటీవల ఎక్కువగా ఫోకస్ చేస్తుండటం కనిపిస్తుంది. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' ఈమధ్యనే వచ్చింది. కమర్షియల్ సకెస్స్ మాటెలా ఉన్న కొన్ని అప్రీషియేషన్స్ మాత్రం దక్కాయి. నిజమైన ప్రేమ అంటే ఆకర్షణ కాదనీ, అలాగే తల్లిదండ్రుల ప్రేమలో ఉన్న నిజాయితీని నిర్లక్ష్యం చేయరాదనే సందేశం అంతర్లీనంగా 'ఆనందతాండవం' చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. విదేశాల మోజులో పడి కొట్టుమిట్టాడుతున్న యువతకు కనువిప్పు కలిగించే ప్రయత్నమూ ఇందులో జరిగింది. ఇదే సమయంలో విదేశాల్లో తమ బిడ్డను ఇస్తే సుఖపడుతుండనే భ్రమలో పడి ముక్కూముఖం తెలియని వారికి ఇచ్చి పెళ్లి చేసి ఆనక చివరి చూపు కూడా దక్కని పరిస్థితుల్లో పుట్టెడు దు:ఖం మూటగట్టుకుంటున్న తల్లిదండ్రులకూ ఓ గుణపాఠం ఉంది. సినిమాలు చూసి మారమని కానీ, మారుతారనీ కానీ ఎవరూ చెప్పరు కానీ...కొన్ని ప్రశ్నలకు జవాబులు వెదుక్కోవచ్చు. అలాంటి ప్రయత్నమే 'ఆనంద తాండవం'. యువ దర్శకుడు గాంధీకృష్ణ ఈ చిత్రానికి ఇచ్చిన ట్రీట్ మెంట్ ఓసారి చూద్దాం...
మధుమిత (తమన్నా) అందంతో పాటు అమాయకత్వం పుణికిపుచ్చుకున్న టీనేజ్ అమ్మాయి. ఆ వయసు వాళ్ల ఆలోచనలు, కోరికలూ ఎలా ఉంటాయో స్పష్టమైన అవగాహన లేని చిన్నపిల్లల మనస్థత్వం ఆమెది. అమ్మానాన్నలు ఏమి చేసినా తన మంచికోసమే అనుకునే తత్వం. ఇంజనీరింగ్ చదువుకున్న రఘుపతి (రిషభ్) రేణిగుంటలోని తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ మధుమితను చూసి ప్రేమలో పడతాడు. రఘుపతిలోని క్వాలిటీస్ నచ్చి అతన్ని ప్రేమించమని మధుమతిని ఆమె తల్లి ప్రోత్సహిస్తుంది. ప్రేమ-పెళ్లి విషయంలో తొందర వద్దని తండ్రి చెప్పే హితవును రఘుపతి పట్టించుకోడు. చివరకు పెద్దల అంగీకారంతో రఘు-మధుమితలకు వివాహ నిశ్చితార్ధం జరుగుతుంది. వేరే చోట ఉద్యోగంలో చేరిన రఘుపతి పెళ్లి పత్రికల పంపకం నాటికి తిరిగి ఇంటికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ఊహించని షాక్ ఎదురవుతుంది. మధుమిత తల్లిదండ్రులు మనసు మార్చుకుని అమెరికాలో పెద్ద బిజినెస్ మన్ అయిన రాధాకృష్ణకు (రిషి) మధుమితను ఇచ్చి పెళ్లిచేయడానికి నిశ్చయించుకుంటారు. తన జీవితానికి సంబధించిన విషయమే అయినా ఏదీ సీరియస్ గా తీసుకోవడం తెలియని మధుమిత సైతం అందుకు సరేనంటుంది. రఘుపతి ఆమెను నిలదిస్తాడు. అతనంటే తనకు ఇష్టమే అయినా రాధాకృష్ణ అయితే అమెరికాలో సెటిల్ కావచ్చని అమ్మానాన్నలు చెప్పడంతో అందుకు అంగీకరించానని మధుమిత అమాయకంగా చెబుతుంది. ఆమెను ఎలాగో ఒప్పించి లేచిపోవాలనే ప్రయత్నం కూడా బెడిసికొట్టడంతో భగ్న హృదయంతో రఘుపతి ఆత్మహత్యాయత్నం చేస్తాడు. నిజంగానే అతను చనిపోయాడా? సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల మధుమిత జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? పర్యవసానం ఏమిటి? అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|