మురుగదాస్ డైరెక్షన్ లో నాగ్?
డిసెంబర్ సెంటిమెంట్ ఫలించి నాగార్జున 'కింగ్' చిత్రం ఈమధ్యనే 100 రోజులు పూర్తి చేసుకుంది. తగినంత రెస్ట్ తీసుకున్న తర్వాతే తదుపరి చిత్రానికి రెడీ అవ్వాలని ఆయన ముందుగానే నిశ్చయించుకున్నారు. ఈ గ్యాప్ లో పలు స్క్రిప్టులు వింటున్నారు. పనిలో పనిగా 'కింగ్ ' చిత్రాన్ని తీసిన కామాక్షి కళా మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డిని సైతం మరో చిత్రానికి సన్నాహాలు చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం శివప్రసాద్ రెడ్డి అదే పనిలో ఉన్నారు. దీనికితోడు మళ్లీ మంచి స్క్రిప్టుతో వస్తే దర్శకుడు శ్రీనువైట్లతో మరో సినిమా చేసేందుకు కూడా నాగార్జున సుముఖంగానే ఉన్నారు. ఇప్పుడు నాగార్జునను డైరెక్ట్ చేసే దర్శకుల జాబితాలో ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కూడా వచ్చి చేరినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.
అమీర్ ఖాన్ హీరోగా హిందీ 'గజనీ' చిత్రంతో ఇప్పుడు మురుగగాస్ పేరు మారుమోగిపోతోంది. పలువురు హిందీ నిర్మాతలు సైతం ఆయనను అప్రోచ్ అవుతున్నారు. అయితే తన తదుపరి వెంచర్ ను షారూక్ ఖాన్ తో చేయాలనే పట్టుదలతో మురుగదాస్ ఉన్నారు. ఇందుకోసం షారూక్ తో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు నాగార్జునకు సరిపడే ఒక స్క్రిప్టు మురుగదాస్ రెడీ చేశారనీ, ఆయనను ఇప్పటికే కలుసుకున్నారనీ ఓ వార్త బలంగా వినిపిస్తోంది. వీటిని ఊహాగానాలుగానే మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ఇది మంచి ప్రపోజల్ అవుతుందనీ, నాగార్జున-మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే సంచలనాలకు కొదవుండవనీ, అసలే ఈ ఏడాది ఇంతవరకూ వేళ్లమీద మాత్రమే లెక్కపెట్టుకునే హిట్లతో తల్లడిల్లుతున్న పరిశ్రమకు ఇది మంచి క్రేజీ ప్రాజెక్ట్ అవుందనీ వారు విశ్లేషిస్తున్నారు. ఏమి జరుగుతుందనేది చూడాలి.
Be first to comment on this News / Article!
|