'బిల్లా'కు సీక్వెల్?
సీనియర్ రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ కలిస్తే ఇక సంచలనాలకు కొదవుండదని ఆశించి 'బిల్లా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ ఇప్పుడు సినిమాను నిలబెట్టేందుకు కొత్త యాక్షన్ ప్లాన్ తో ముందుకు వస్తున్నారు. ఇందుకు కారణం 'బిల్లా' చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి సరైన ఫీడ్ బ్యాక్ రావడం లేదనీ, ఎన్నికలు, ఐపిఎల్ మ్యాచ్ లు, మరికొంత రెషిసన్ (ఆర్థిక మాంద్య) పరిస్థితులుగా ఇండస్ట్రీలో చెబుతున్నారు. తమిళ 'బిల్లా'కి కొద్ది పాటి మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుందని నిర్మాత కృష్ణంరాజు తొలుత భావించారనీ, అయితే స్టయిలిష్ గా సినిమా ఉంటుండదనే మిషతో దాదాపు 28 కోట్ల వరకూ ఆయన చేత ఖర్చు చేయించారని తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో రిటర్న్స్ లేవని బయ్యర్లు వాపోతున్నారనీ, కంపెన్సేషన్ ఆశిస్తున్నారనీ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో మెహర్ రమేష్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూలు, ప్రమోషన్ వర్క్ కు నడుం బిగించారు. పనిలో పనిగా ఓ ఫీలర్ కూడా బయటకు వచ్చింది. ఇదే యూనిట్ 'బిల్లా' సీక్వెల్ కు కూడా ప్లాన్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది.
'బిల్లా' చిత్రానికి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన తరుణంలో 'బిల్లా-2' కు గోపీకృష్ణ మూవీస్ అధినేత కృష్ణంరాజు నిజంగానే సుముఖంగా ఉన్నారా అనేది ఇంకా తెలియవలసి వచ్చింది. ప్రస్తుతానికి ఆయన తన సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం కంటే ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడలో పోటీ చేస్తున్నందున ఎన్నికలపైనే ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బిల్లా ' 10 రోజుల్లో 11 కోట్ల షేర్ వసూలు చేసిందంటూ ఏరియాల వారిగా గణాంకాలను చెబుతో ఓ ట్రేడ్ రిపోర్డ్ కూడా విడుదల చేశారు. 'బిల్లా' సీక్వెల్ ను ప్రకటించినట్టయితే సినిమా చూడని వాళ్లను కూడా థియేటర్లకు రప్పించవచ్చనీ, ఇందువల్ల రాంగ్ రన్ సాధ్యమవుతుందని మెహర్ రమేష్ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే అసలె బడ్జెట్ రికవరీ కావడం లేదన్న రిపోర్టుల మధ్య 'బిల్లా-2'కు నిర్మాతలు సుముఖంగా ఉన్నారా? తెలుగులో సీక్వెల్స్ కు పెద్దగా ఆదరణ ఉండదనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటారా అనేది వేచిచూడాల్సిందే.
Be first to comment on this News / Article!
|